ఆదివాసీ గ్రామంలో సౌకర్యాలు కల్పించాలి : రమణ
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
భద్రాచలం ఐటీడీఏకి కూతవేటు దూరంలో ఉన్న సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని ఆదివాసీ గ్రామం శ్రీరాంపురం ఎస్టీ కాలనీలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలని బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రమణ కోరారు. ఆ గ్రామంలో పాముకాటుకు గురై సత్వరవైద్యం అందక మరణించిన వెట్టి రాధ కుటుంబాన్ని పరామర్శించి ఆ గ్రామం సమస్యలపై బుధవారం ఓ ప్రకటన చేశారు.
శ్రీరాంపురం ఎస్టీకాలనీ ఆదివాసి గ్రామంలో దాదాపు 100 కుటుంబాలు నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ గ్రామంలో విద్యుత్తు, త్రాగునీరు, ప్రాథమిక విద్య, అంగన్ వాడీ, రోడ్డుమార్గం వంటి కనీససౌకర్యాలు లేవని తెలిపారు. విద్యుత్తు సౌకర్యం లేకపోవడం వల్ల పాముకాటుకి గురై, రహదారి సౌకర్యం కూడా సరిగా లేకనే సకాలంలో వైద్యచికిత్స అందక ఆదివాసీ మహిళ రాధకు మరణం సంభవించిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే,ప్రజా ప్రతినిధులకు ఎన్నికల సమయంలో మాత్రమే ఈ గ్రామం గుర్తుకొస్తుందేమోనని విమర్శించారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వాధికారులు స్పందించి ఈ గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు గోడేటి వెంకటేశ్వర్లు, కొప్పుల రాంబాబు, పొడుతూరి రవీందర్, తదితరులు కూడా పాల్గొన్నారు.