ఐటీడీఏ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష
ఏజెన్సీలో మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంపులు నిర్వహించాలని సూచన
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం
మారుమూల గిరిజన ప్రాంతాలలో మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంపులు నిర్వహించేలా షెడ్యూల్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం భద్రాచలంలో ఐటీడీఏ కార్యాలయంలో పీఓ ప్రతీక్ జైన్ తో కలిసి కలెక్టర్ ఐటీడీఏ కార్యకలాపాలపై సమీక్షించారు. ఆర్ఓఎఫ్ఆర్, గిరిజన విద్య, గురుకులం, గిరిజన ఇంజనీరింగ్ విభాగం, అంగన్ వాడీ భవనాలు, సీఎం గిరివికాసం, యువజన శిక్షణకార్యక్రమాలు, జీసీసీ,వైద్య ఆరోగ్యశాఖ, తదితర విభాగాలలో ఐటిడిఏ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాల తీరుపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయా శాఖల ద్వారా అమలు జరుగుతున్న కార్యక్రమాల ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాకలెక్టర్ మాట్లాడుతూ, మారుమూల గిరిజన గ్రామాలలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ చర్యల్లో భాగంగా వచ్చే వారంలో మల్టీస్పెషాలిటీ హెల్త్ క్యాంపులు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆరోగ్యకేంద్రాల నిర్వహణ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణకు ప్రజలు పాటించాల్సిన ఆరోగ్య నియయాల గురించి వివరించాలన్నారు. 102, 108 అంబులెన్సు వెళ్లడానికి రహదారి సౌకర్యం లేని గ్రామాల జాబితా అందజేయాలని కలెక్టర్ జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. మంచినీటి సౌకర్యం లేని పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల జాబితా అందజేయాలని చెప్పారు. ఐటీడీఏ ద్వారా నిర్వహిస్తున్న పాఠశాలల్లో విద్యార్థుల కోసం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు అందజేయాలని గిరిజన సంక్షేమ శాఖ డిడిని ఆదేశించారు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేని కారణంగా 15 పంచాయతీలకు భవనాల నిర్మాణానికి స్థలసమస్య ఏర్పడిందని, వీటి నిర్మాణానికి అటవీశాఖ ద్వారా స్థల సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. ఐటీడీఏ కార్యాలయం ప్రాంగణంలో డిజిటల్ ల్యాబ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేయాలని చెప్పారు. 21వైకుంఠధామాల్లో నీటిసరఫరా కల్పనకు చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రెకార్, ఎంఎస్ఎంఈ పథకాల ద్వారా స్వయంఉపాధి యూనిట్ల ఏర్పాటు కోసం రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని, రుణాల మంజూరు ప్రక్రియపై బ్యాంక్ కంట్రోలర్స్ తో సమావేశం నిర్వహణ కు చర్యలు తీసుకోవాలని ఆమె ఎల్టీఎంకు సూచించారు. గిరిజనకళాకారులు తయారు చేసే హస్తకళలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా రైతులకు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో ఆదాయం పెంచేమార్గాలను అన్వేషించాలని చెప్పారు. అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలోని యూత్ ట్రైనింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, ఆ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. శిక్షణలో మెలకువలు నేర్చుకుని, ఉపాధి రంగంలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మధుసూదన్ రాజు, సహకార అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, డీఈఓ వెంకటేశ్వరచారి, ఆర్సీఓ డేవిడ్ రాజు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ మణెమ్మ, ఎస్ఓ సురేష్, తదితరులు పాల్గొన్నారు.