ప్రాణాంతకంగా మారిన అంతర్రాష్ట్ర రహదారి
మరమ్మతులు చేయకపోతే ప్రాణాలు గాలిలోనే…
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
తెలంగాణ – ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలోనిబూర్గంపాడు – కుక్కునూరు మండలాల మధ్య అంతర్రాష్ట్ర ప్రధాన రహదారి అత్యంత ప్రమాదరంగా మారింది. ఇటీవల వచ్చిన గోదావరి వరదల్లో బూర్గంపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దుల్లోని కన్నెరసాని నది వరకు ప్రధానమైన ఆర్ అండ్ బి రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నది. ముఖ్యంగా బూర్గంపాడు శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు ప్రాంతం నుంచి, అంటే బూర్గంపాడు మండలకేంద్రం శివారుప్రాంతం నుంచి సమ్మక్క- సారలమ్మ గుడిదాకా రోడ్డు కోతకు గురైంది. గోదావరి నది వైపు నుంచి కిన్నెరసాని నదివైపు రోడ్డు మీద నుంచి వరదనీరు ప్రవహించడంతో రోడ్డు అంచు కోతకు గురైంది. దీనివల్ల ఇక్కడ రోడ్డుతో సహా అంచు కోతకు గురై 5అడుగుల నుంచి 10 అడుగుల లోతులో గోతులేర్పడ్డాయి. భద్రాచలం నుంచి కుక్కునూరు, అశ్వారావు పేట మీదుగా రాజమండ్రి వెళ్లే ప్రధాన రహదారి ఇదే కావటం వల్ల ప్రతిరోజూ వందల సంఖ్యలో బస్సులు, లారీలు, ఇతర వాహనాలు ఈ రోడ్డుపైనే వెళ్తుంటాయి. రోడ్డు అంచు కొట్టుకుపోయి పెద్దపెద్ద గోతులతో అత్యంత ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళల్లో ఎదురుగా వచ్చే వాహనాల వెలుతురులో రోడ్డు అంచు కనిపించని పరిస్థితి ఉంది. పారపాటున ఎవరైనా వాహనదారులు ఈ అంచుకు వెళ్లారంటే గోతుల్లో పడి పోరణాలు పోవటం ఖాయంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంతం తెలంగాణలోనే ఉండటంతో, తెలంగాణ ఆర్ అండ్ బి శాఖాధికారులు స్పందించి దీనిని బాగు చేయాల్సిన అవసరముంది. బూర్గంపాడు పోలీసులు తమ పరిధిలో అవకాశం ఉన్నంతవరకు ఈ ప్రాంతంలో అక్కడక్కడా బారికేడ్లు, ఎర్రజెండాలు ఏర్పాటు చేసినప్పటికీ, అవి ప్రమాదాలను నిరోధించేందుకు సరిపోవడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ రోడ్డుకు మరమ్మతులు చేయించాలని, తెలంగాణ ఆంధ్రా, ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.