‘విమోచన దినోత్సవ వేడుకలే ఆనాటి త్యాగధనులకు నివాళి’
విమోచన దినోత్సవం ఎగ్జిబిషన్ ప్రారంభించిన వైస్ ఛాన్సలర్లు
✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు
హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు జరుపుకోవడం, ఆనాటి నిజాం పాలకులకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసిన వారికి అర్పించే సముచితమైన నివాళి అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బసుత్కర్ జగదీశ్వర్ రావు, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఫ్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ బొల్లారం లోని రాష్ట్రపతి నిలయంలో సెప్టెంబర్ 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ వారిద్దరూ శుక్రవారం ప్రారంభించారు. కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్(సిబిసి) ఏర్పాటుచేసిన తెలంగాణ స్వాతంత్య్రోద్యమ ఛాయాచిత్ర, నాటి స్వాతంత్య్ర సమరయోధుల విశేషాల ప్రదర్శన ఆదివారం వరకు కొనసాగనుంది.
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజలపై జరిగిన వేధింపులు, అకృత్యాలు, అఘాయిత్యాలను మర్చిపోలేమన్నారు. ఆ నాడు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరమెంతైనా ఉందన్నారు. నిజాం పాలనలో పరకాలలో 22 మందిని కాల్చి చంపిన ఘటనను గుర్తు చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం ఆనాడు చోటు చేసుకున్నాయని, ఈ తరహా ఘటనలను ఎలా మర్చిపోగలమని వారు ప్రశ్నించారు. నాటి ఘటనల్లో చనిపోయిన వారు మన సోదర, సోదరీమణులన్నారు. ఇంతమంది త్యాగాలు చేయడం వల్లనే సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ విమోచనం పొందిందన్నారు. అందుకే ఆ రోజును ‘విమోచన దినోత్సవం’గా జరుపుకుంటున్నామన్నారు. నేటి తరం యువత నాడు చోటుచేసుకున్న ఘటనల గురించి తెలుసుకోవాలన్నారు. రజాకార్ల మూకలు ఈ దాడులు చేశారనే విషయం గుర్తుచేశారు. ప్రతిఒక్కరూ సమాజాభివృద్ధి కోసం తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి నిలయం పాలనా వ్యవహారాల అధికారిణి రజినిప్రియ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ డిప్యూటీ డైరెక్టర్ కరీనాబి తెంగమామ్, అసిస్టెంట్ డైరెక్టర్ హరిబాబు, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మ నాయక్, ఫీల్డ్ ఎగ్జిబిషన్ అసిస్టెంట్ అర్థ శ్రీనివాస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.