టెట్ పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల శుక్రవారం లక్ష్మీదేవిపల్లిలోని కృష్ణవేణి జూనియర్ కళాశాలలో టెట్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థుల హాజరు వివరాలను ఆ కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. గదుల్లో పరీక్ష రాస్తున్న అభ్యర్థుల తీరును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) ప్రశాంతంగా జరిగినట్లు చెప్పారు. జిల్లాలో 37 కేంద్రాల్లో పరీక్ష మొదటి పేపర్ కు 8717 మంది, రెండో పేపర్ కు 6661 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా మొదటిపేపర్ కు 7307మంది హాజరుకాగా, 1410 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. రెండో పేపర్ కు 6661 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 6131 మంది హాజరై, 530 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పరీక్షను సజావుగా, సక్రమంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ప్రశాంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన సిబ్బందికి అభినందనలు తెలిపారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించి ప్రశాంతంగా వ్రాయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో 37 కేంద్రాలలో పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.