పూసుగూడెం పంచాయతీకి రాష్ట్రస్థాయి అవార్డు
సర్పంచి, కార్యదర్శికి జిల్లాకలెక్టర్ ప్రశంసలు
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామపంచాయతీ స్వచ్ఛసర్వేక్షణ్ లో రాష్ట్రస్థాయిలో అవార్డు (పురస్కారం) సాధించడం పట్ల జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆమె కార్యాలయంలో
సర్పంచి విజయ, కార్యదర్శి శ్రీను తోపాటు, జిల్లా అధికారులను అభినందించారు. ఈ అవార్డును గురువారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నుంచి స్వీకరించిన అధికారులు, సర్పంచ్, తదితరులు శుక్రవారం కలెక్టరును కలిసి, ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయం వల్ల గ్రామాల అభివృద్ధికి నిరంతరం పాటు పడుతున్నారని ప్రశంసించారు. పూసుగూడెం గ్రామ పంచాయితీ
ఓడీఎఫ్ ప్లస్ సాధించడం, విలేజ్ సెల్ఫ్ అసెస్ మెంట్ పక్కాగా చేయడంతో రాష్ట్ర స్థాయిలో అవార్డు సాధించినట్లు చెప్పారు. ఇంకుడు గుంతల నిర్మాణం, నిర్వహణ, డంపింగ్ యార్డు నిర్వహణ, శ్మశానవాటిక నిర్మాణం, నిర్వహణ, గ్రామ పరిశుభ్రత, సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామంలో పచ్చదనం కోసం మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు బాగున్నాయని, బాగా పని చేస్తున్నారని అభినందించారు. గ్రామ సర్పంచ్, కార్యదర్శి సమన్వయంతో గ్రామాభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారన్నారు. హైదరాబాదులో గురువారం జరిగిన అవార్డుల ప్రదానంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతులతో డీఆర్డీఓ మధుసూదన్ రాజు, డీపీఓ రమాకాంత్, జడ్పీ సీఈఓ విద్యాలత, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ లక్ష్మయ్య, సర్పంచ్ బాణోత్ విజయ, కార్యదర్శి శ్రీను అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. జిల్లా అన్నిరంగాల్లో పోటీ పడుతూ ఆదర్శంగా ముందుండాలన్నారు. అవార్డు సాధించి ఇతర పంచాయతీలకు ఆదర్శంగా నిలిచారని,ఈ స్ఫూర్తితో మరిన్ని పంచాయతీలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులతో ఈ జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ మధుసూధన్ రాజు, డీపీఓ రమాకాంత్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ లక్ష్మయ్య, సర్పంచ్ విజయ, కార్యదర్శి శ్రీను, స్వచ్ఛభారత్ మిషన్ సిబ్బంది రేవతి, ఖాదర్, తదితరులు పాల్గొన్నారు.