విద్యతోనే దివ్యాంగులు అభివృద్ధి సాధించాలి : కలెక్టర్
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
విద్యా సముపార్జన ద్వారానే దివ్యాంగులు అభివృద్ధి సాధించగలుగుతారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా ప్రియాంకఅల తెలిపారు. పాత కొత్తగూడెంలోని తెలంగాణ పాఠశాలలో గురువారం విద్యాశాఖ, సమగ్ర శిక్షా అభియాన్, అలీంకో కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థుల కోసం నిర్వహించిన ఉపకరణాల పంపిణీలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగులు ఏ విషయంలో తక్కువ కాదని, ఆత్మన్యూనతను విడనాడి అన్నిరంగాల్లో రాణించాలని చెప్పారు. ఈ జిల్లాలో దాదాపు 1700 మంది దివ్యాంగ విద్యార్థులున్నారని, వారిలో ఉపకరణాలు అందజేయడానికి నియమించిన కమిటీలో పారదర్శకంగా 445మంది ఎంపిక చేసినట్లు చెప్పారు. విద్యార్థులకెంతో ఉపయోగపడే పరికరాలు, ఇతరులపై ఆధారపడకుండానే స్వశక్తితో ముందుకు సాగేందుకు సహాయం చేస్తాయని చెప్పారు. మనిషి ఎదుగుదలకు వైకల్యం అడ్డుకాదంటూ, చైతన్యవంతులై దివ్యాంగులు ప్రతిభావంతులుగా తయారు కావాలని చెప్పారు. మంచి ఉపకరణాలను అందించినందుకు కలెక్టర్, అలీంకో కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు. జిల్లా పరిధిలో విడుతలవారీగా అర్హులందరికీ ఈ ఉపకరణాలు అందిస్తామని ఆమె చెప్పారు. 18 ఏళ్లలోపు దివ్యాంగులకు ఉపకరణాలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా ఎంపికల్లో భాగస్వాములైన వారందరిని జిల్లాకలెక్టర్ అభినందించారు. కొత్తగూడెం మున్సిపల్ ఛైర్ పర్సన్ సీతాలక్ష్మి మాట్లాడుతూ, రూ. 35 లక్షల విలువైన ఉపకరణాలందించినట్లు చెప్పారు. ఆత్మస్థైర్యంతో దివ్యాంగులంతా ముందుకుసాగాలని సూచించారు. తర్వాత దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన జిల్లాకలెక్టర్,వారికి శుభాకాంక్షలు తెలిపారు.
అక్కడే ఉన్న ప్రాధమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించి, పలకలపై రాసిన అక్షరాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి వెంకటేశ్వరచారి, మహిళా శిశు సంక్షేమ అధికారి విజేత, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రవిబాబు, డా వెంకన్న, డా హిమబింధు, డా కోటేశ్వరావు, కౌన్సిలర్లు పరమేష్ యాదవ్, విజయ్, ప్రసాద్, అకడమిక్ కో ఆర్డినేటర్లు సైదులు, నాగరాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.