నేడు జిల్లాలో ‘టెట్’ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ‘టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహణ కోసం ఎంపిక చేసిన 37 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లన్పీ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ప్రియాంకఅల తెలిపారు. సెప్టెంబరు15వ తేది శుక్రవారం జరుగనున్న టెట్ పరీక్ష నిర్వహణ గురించి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టెట్ ఉపాధ్యాయ ఉద్యోగ సాధనలో కీలకమైన ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చివరి నిమిషం వరకు ఆలస్యం చేయకుండా తమ పరీక్ష కేంద్రాలకు ముందస్తుగా చేరుకోవాలని సూచించారు. జిల్లాలో 37 కేంద్రాలలో పరీక్ష మొదటి పేపర్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని వెల్లడించారు. ఈ పరీక్షలో మొదటి పేపర్ పరీక్షకు 37 కేంద్రాలు, రెండో పేపర్ పరీక్ష 29 కేంద్రాలలో జరుగుతుందని చెప్పారు. జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం మండలాల్లోని 37 కేంద్రాల్లో 8,717మంది టెట్ పరీక్షకు హాజరు కాబోతున్నట్లు చెప్పారు. కొత్తగూడెంలో 16, పాల్వంచ 6, మణుగూరు 8, భద్రాచలంలో 7 కేంద్రాల్లో పటిష్ట భద్రత మధ్య ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని, అభ్యర్థులు ఎలాంటి అక్రమాలకు, మాల్ ప్రాక్టీస్ పాల్పడకుండా నిష్పక్షపాతంగా పరీక్ష రాయాలని చెప్పారు. పరీక్ష హాలులోకి ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్ లకు అనుమతి లేదని చెప్పారు. విధులు కేటాయించిన సిబ్బంది ఉదయం 7 గంటల లోపునే పరీక్షా కేంద్రంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.