సారపాకలో పోలీసుల అదుపులో నకిలీ విలేకరులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుక్కునూరు మండలం వాసులు
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పరిధిలోని సారపాక గ్రామంలో గురువారం ముగ్గురు నకిలీ విలేకరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై బాధితులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి… సారపాక గ్రామం శ్రీరాంపురం ప్రాథమిక పాఠశాలలో బుధవారం తమను తాము విలేకరులుగా పరిచయం చేసుకున్న ముగ్గురు వ్యక్తులు, ఉపాధ్యాయినులను డబ్బులు అడిగారు. ప్రముఖ చానెల్ పేరు చెప్పి డబ్బులడిగిన వారిపై పాఠశాల నుంచి బూర్గంపాడు ఎస్సై రాజ్ కుమార్ కు సమాచారం వచ్చింది. ఈ వ్యవహారంపై నిఘా పెట్టి ఉంచి గురువారం మరోసారి డబ్బులకోసం అక్కడకు వచ్చిన సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుక్కునూరు మండలం వాసులుగా తెలుస్తోంది. వారిలో ఒకరు ఉమ్మడి రాష్ట్రం సమయంలో బూర్గంపాడు మండలపరిషత్ లో ఎంపీటీసీ సభ్యుడిగా కూడా ఉండటం విశేషం. మిగిలిన ఇద్దరు వ్యక్తులు అతని అనుచరులుగా భావిస్తున్నారు. ముగ్గురినీ గురువారం బూర్గంపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.