మణుగూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేయాలి
మున్సిపల్ కమిషనరుకు వినతిపత్రం అందజేసిన రవి, దుర్గ
✍🏽 దివిటీ మీడియా – మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని హోటళ్లలో ఆహార నాణ్యత తెలుసుకునేలా తనిఖీలు చేయాలని సామాజిక కార్యకర్త కర్నె రవి, పినపాక నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించిన పాల్వంచ కోరారు. ఈ మేరకు బుధవారం మణుగూరు మున్సిపల్ కమిషనరుకు వినతిపత్రం అందజేశారు. ఈ మండలంలో చిన్న చిన్న కాలనీలు మొదలుకొని ప్రధాన రహదారుల వరకు హంగు, ఆర్భాటాలతో పుట్టగొడుగుల హోటల్స్ వెలుస్తున్నాయని పేర్కొన్నారు. మణుగూరులో బ్యాచులర్స్, ఉద్యోగరీత్యా సమయం లేనివారు హోటల్ పుడ్ కు అలవాటు పడినవారు అనారోగ్యం బారినపడుతున్నారని తెలిపారు. ఇటీవల మణుగూరు ప్రాంతంలో రకరకాల పేర్లతో రెస్టారెంట్లు వెలుస్తున్నాయని, ఆ హోటళ్లలో చేసే వంటపదార్థాలు, ఉపయోగించే నూనె, ఇతర సామాగ్రి పై ఫుడ్ ఇన్స్పెక్టర్ల తనిఖీలు చేయాలని కోరారు. రకరకాల రంగులను ఆహారంలో కలుపుతున్నారని, అక్కడక్కడ కొన్ని హోటళ్లలో ఫుడ్ పాయిజన్ అయినా, అలాంటివి బహిర్గతం కాకుండా ఆ హోటళ్ల యజమానులు జాగ్రత్తపడుతున్నారన్నారు. అలాంటివాటిని శాశ్వతంగా మూసేయాలని ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని వారు కోరారు.