Divitimedia
Bhadradri KothagudemCrime NewsTelangana

ఇసుకర్యాంపు దగ్గర ‘ఇష్టారాజ్యం’… ప్రమాదకరం…

ఇసుకర్యాంపు దగ్గర ‘ఇష్టారాజ్యం’… ప్రమాదకరం…

రహదారి గోతులమయం… లారీల పార్కింగ్ అడ్డదిడ్డం…

✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని పాతగొమ్మూరు ఇసుక ర్యాంపు దగ్గర ‘కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం’గా మారింది. ఇసుక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, లెక్క లేనితనం కారణంగా బూర్గంపాడు నుంచి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి గోతులతో, రోడ్డు మీదనే నిలిపివేస్తున్న లారీల వరుసల వల్ల ప్రమాదకరంగా తయారైంది. ఇక్కడ ర్యాంపు నుంచి బయటకు తెచ్చి పొలాల్లో గుట్టలుగా పోసిన ఇసుకను తరలించేదాకా నిబంధనలకు పాతరేసిన కాంట్రాక్టర్లు, తమ సదుపాయం కోసం ప్రజలు, ప్రయాణికుల్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రాంతంలో రోడ్డుపైనే దారిపొడవునా నిలిపి ఉంచుతున్న లారీలతో, ఇసుక రవాణా చేసే క్రమంలో ఏర్పడిన పెద్ద పెద్ద గోతులతో పెను ప్రమాదం ఏర్పడుతోంది. అంతకుముందే, సాధారణ పరిస్థితుల్లోనే ప్రమాదకరమైన ఆ మూలమలుపులో ఇప్పుడు లారీలను అడ్డ దిడ్డంగా నిలిపి ఉంచడంతో కనీసం ఎదుట నుంచి వచ్చే వాహనాలు కూడా కనిపించని దుస్థితి ఏర్పడింది. ప్రమాదాలు జరిగేందుకు అవకాశం మరింత పెరిగింది. ఇక్కడ ఇసుక లారీలు పొలాల్లో నుంచి అడ్డదిడ్డంగా తిప్పి, ఇసుకలోడ్లతో రోడ్డు మీదకు వస్తుండటంతో బురదమట్టి రోడ్డు మీద పేరుకునిపోతోంది. తడిగా ఉన్నప్పుడు ఆ మట్టిలో వాహనాలు జారుతుండటంతో ప్రమాకరంగా మారింది. ఆ మట్టి ఎండిపోయినప్పుడు వచ్చే పోయే వాహనాలతో భారీగా దుమ్ములేస్తూ కళ్లలో, బట్టలపై పడుతుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆ ఇసుకర్యాంపు దగ్గర దాదాపు అరకిలోమీటరు వరకు రోడ్డు మీద ప్రయాణం నరకంగా మారిపోయిందని ప్రయాణికులు వాపోతున్నారు. ఎవరో కొంత మందికి లాభాలపంట పండించుకునేందుకు తామింకా ఎన్నరోజులు ఈ దుర్భర పరిస్థితి అనుభవించాలని ప్రశ్నిస్తున్నారు. వేసవిలో కేవలం దుమ్ములేవడం వల్ల ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు దుమ్ముకుతోడు రోడ్డు మీద నిలిపివేస్తున్న లారీలు, రోడ్డు మొత్తం ఏర్పడిన గోతులతో ప్రమాదాలు, బురద, దుమ్ముతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మండల అధికారులు ఇసుకర్యాంపు దగ్గర పరిస్థితులను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని, లేదంటే జిల్లాస్థాయి ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని ఈ ప్రాంత ప్రజలతోపాటు, భద్రాద్రి శ్రీరాముడి ఆలయానికి ఈ రోడ్డు మీదుగానే వచ్చివెళ్లే ప్రయాణికులు కోరుతున్నారు.

Related posts

క్రీడాపాఠశాలలో ప్రవేశాలకు 21 నుంచి మండలస్థాయి ఎంపికలు

Divitimedia

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ 

Divitimedia

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో సమన్వయంతో పనిచేయాలి

Divitimedia

2 comments

Diviti Media 14/09/2023 at 4:55

ఈ కథనం మీకు నచ్చితేనే మీకు తెలిసినవారందరికీ షేర్ చేయండి…

Reply
Diviti Media 14/09/2023 at 4:55

పాఠకులకు దివిటీ మీడియా విజ్ఞప్తి…
మా కథనాలు, వార్తా విశేషాలు మీకు నచ్చితే… కాస్త మీకు తెలిసినవారందరికీ షేర్ చేయండి…

Reply

Leave a Comment