ఓటరు దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి
వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం, మణుగూరు
ఓటరు దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. సోమవారం హైదరాబాదులోని ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి “ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం-2023″పై జిల్లా కలెక్టర్లు, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణల కోసం వచ్చిన దరఖాస్తుల విచారణ ప్రక్రియ వేగవంతం చేసి, త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 18, 19 సంవత్సరాలు వయస్సు నిండిన ప్రతిఒక్కరు ఓటరుజాబితాలో నమోదయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, లింగ నిష్పత్తి వారీగా దరఖాస్తు ఫారాలను పరిశీలించి ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీలోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ఓటరు నమోదు, ఓటరుజాబితాలో సవరణల కోసం అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించడంతో పాటు ‘ఆన్ లైన్’లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ట్రాన్స్ జెండర్లు, కళాశాలల్లో తరచుగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తూ, నూతన ఓటరు నమోదుతోపాటు ఓటరు జాబితాలో సవరణలపై ప్రజలను చైతన్య పరిచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆదివాసీ గ్రామాలలో ఓటరు నమోదుపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. దివ్యాంగులు, వయోవృద్ధులను ఓటరు జాబితాలో ప్రత్యేకంగా మార్కింగ్ చేస్తున్నామని, జనాభా, లింగ నిష్పత్తి ప్రకారం స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కళాశాలల్లో 18, 19 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను నూతన ఓటరుగా నమోదు చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీకి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్ రాజు, కొత్తగూడెం ఆర్డీవో శిరీష, భద్రాచలం ఆర్డీవో మంగీలాల్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
—————————-
సమగ్రమైన ఓటరు జాబితా తయారీకి చర్యలు : ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్
——————————————
సెప్టెంబరు 19 వరకు ఓటర్ నమోదు ప్రక్రియ, మరణించినవారి వివరాలు, అడ్రస్ మార్పులు, పెళ్లి చేసుకుని వెళ్లిపోయినవారి వివరాలు, సంబంధిత పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓటర్ల ఇంళ్లకు వెళ్లి, కుటుంబ సభ్యులను సంప్రదించి, సంబంధిత ఫారాల్లో పూరించి, ఓటరు జాబితాలో సవరణలు చేయాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పినపాక ఎస్టీ నియోజకవర్గ ఇఆర్ఓ ప్రతిక్ జెన్ అన్నారు. సోమవారం హైదరాబాదు నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అసెంబ్లీ, సాధారణ ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఐటీడీఏ కాన్ఫరెన్సు హాల్లో పీఓ ప్రతిక్ జైన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ సూచనల మేరకు పినపాక నియోజకవర్గం పరిధిలో ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపులు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు ఫారం 6 ద్వారా 4238 మందిని ఓటర్లుగా నమోదు చేశామని వెల్లడించారు. పారం 8 ద్వారా సవరణలు, బదిలీలు అయిన ఓటర్లు 6381 మంది వివరాలు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఫారం7 ద్వారా 2,619 మంది ఓటర్లను తొలగించినట్లు ఆయన సీఈవోకు వివరించారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం ఎలక్షన్ నాయిబ్ తహసిల్దార్ నాగరాజు, ఏఈఆర్ఓ రాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.