పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి
పీస్ కమిటీ సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
కులమతాలకు అతీతంగా ప్రజలందరూ అన్ని పండుగలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ కోరారు. ఈ మేరకు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాలతో కొత్తగూడెం పట్టణంలో మత పెద్దలందరితో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. స్థానిక ఐఎంఏ ఫంక్షన్ హాలులో ఈ సమావేశం జరిగింది. ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. కొత్తగూడెం పట్టణం, పరిసర ప్రాంతాలకు చెందిన గణేష్ ఉత్సవకమిటీల సభ్యులు ముందుగానే సంబంధిత పోలీసు స్టేషన్ లో సమాచారమందించి, ఆ తర్వాత గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసు అధికారుల సూచన మేరకు నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని కోరారు. ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మత పెద్దల నుంచి సూచనలను, సలహాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సీఐ పెద్దన్న కుమార్, వన్ టౌన్ సీఐ కరుణాకర్, టూటౌన్ సీఐ రమేష్, త్రీ టౌన్ సీఐ మురళి, తదితరులు పాల్గొన్నారు.