ప్రగతి విద్యానికేతన్ లో వైభవంగా ఉపాధ్యాయ దినోత్సవం
✍🏽 దివిటీ మీడియా – సారపాక
బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో స్థానిక ప్రగతి విద్యానికేతన్ లో ఉపాధ్యాయ దినోత్సవాలు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రగతి స్కూల్ కరస్పాండెంట్ సానికొమ్ము బ్రహ్మారెడ్డి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి వివరించారు. ఉపాధ్యాయ వృత్తి అమూల్య మైనదని, ఎంతోమంది విద్యార్థులను తీర్చి దిద్దిన ఘనత ఉపాధ్యాయ వృత్తిలోనే ఉంటుందని తెలియజేశారు. ఒక విద్యార్థి దశ నుంచి ఉన్నత రాజకీయ నాయకుడి దాకా ఎదుగుదలకు గురువునుంచే నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయని వివరించారు. విద్యార్థిని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుడిదని, చీకటిలో వెలుగునిచ్చే కొవ్వొత్తిలా, విద్యార్థి ఆలోచనలను బట్టి అతనిలోని నైపుణ్యాన్ని వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయుడిదన్నారు. ‘చీమను చూసి క్రమశిక్షణ, భూమిని చూసి ఓర్పు, చెట్టును చూసి ఎదుగుదల, ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో’ అనే మాటను ఆయన గుర్తు చేశారు. హెడ్మాస్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ ఙానాన్ని పంచే గురువుకు పాదాభివందనాలు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఉత్సాహభరిత వాతావరణం నడుమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం చేశారు.