మహిళల రక్షణే షీటీమ్స్ ప్రధాన లక్ష్యం : ఎస్పీ డా.వినీత్
నేడు ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమం
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
ఆకతాయిల వల్ల గానీ, మరే విధమైన వేధింపులతో గానీ ఇబ్బందులెదుర్కొంటున్న మహిళలు, యువతులు, బాలికలెవరైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మహిళల రక్షణ కోసం షీటీమ్స్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీమ్స్ పనిచేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు ఏ మాత్రం భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాల, పాఠశాల విద్యార్థినులు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ లకు గురైనా, మహిళలు పని చేసే ప్రదేశాల్లో వేధింపులకు గురైనా, లైంగిక వేధింపులతో బాలికలపై ఎవరైనా దాడులకు, వేధింపులకు పాల్పడినా వెంటనే నిర్భయంగా షీ టీమ్ పోలీసులను ఆశ్రయిస్తే సత్వర న్యాయం చేకూరుస్తామని ఎస్పీ తెలిపారు. షీటీమ్స్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ బృందాల ద్వారా జిల్లా వ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా షీటీమ్స్ కు ఆగస్టు నెలలో అందిన 30 ఫిర్యాదులలో 5 ఎఫ్ఐఆర్ లు, కౌన్సెలింగ్ ద్వారా 10కేసులు,15 పెట్టీకేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. చిన్న పిల్లల రక్షణ విషయంలో పోలీసు శాఖ పటిష్ఠమైన చర్యలు చేపడుతుందన్నారు. మహిళలు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, తదితర సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తలు వహించాలని, వాటిలో ఫొటోలు, వీడియోలు పోస్టుచేసేటప్పుడు వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసులను నేరుగా సంప్రదించలేని వారు 8712682131 ఫోన్ నంబరుకు గానీ, డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
—————————————–
నేడు ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమం
—————————————–
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని, పరిష్కరించడం కోసం మంగళవారం (సెప్టెంబరు 5వ తేది) ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ డా వినీత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటల నుంచి 12.30 గంటల వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రజలు 08744-243666 నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలు, ఫిర్యాదులు తెలుపుకోవచ్చని తెలిపారు.