అసెంబ్లీ ఎన్నికల్లోపు ఓటర్లకు చివరి అవకాశం
సవరణల కోసం సెప్టెంబరు 2, 3 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు
సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచన
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
త్వరలో జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరుగా నమోదై, ఓటుహక్కును వినియోగించుకునే చివరి అవకాశం ఈనెల (సెప్టెంబరు)2, 3 తేదీలలో కల్పించారు. ఈ రెండు రోజులపాటు ఓటర్లుగా నమోదయ్యే వారికోసం ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే అక్టోబరు 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండే యువతీ యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సెప్టెంబర్ 2, 3తేదీల్లో (శని, ఆదివారాల్లో) నిర్వహించనున్న ఈ ప్రత్యేక క్యాంపుల్లో ఓటర్లందరూ తమ తమ ఓటు జాబితాలో పరిశీలన చేసుకోవాలని ఆమె సూచించారు. తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనలో బాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపుల్లో ఏమైనా తప్పొప్పులుంటే వాటిని సవరించడం కోసం ఆ ఓటర్లు నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్న ఈ రెండురోజుల్లో జిల్లాలో మొత్తం 1095 పోలింగ్ కేంద్రాలలో బూత్ స్థాయి అధికారులు ఓటరు జాబితాలతో అందుబాటులో ఉంటారని ఆమె తెలిపారు. కొత్తగా ఓటరుగా నమోదు కోసం ఫారం-6, సవరణలు, మార్పులు, చేర్పులకు ఫారం 8, తొలగింపుల కోసం ఫారం- 7 ను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఫారం 6,7 మరియు 8 ఫారాలు అన్ని పోలింగ్ కేంద్రాలలో బీఎల్ఓ వద్ద అందుబాటులో ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఓటరు నమోదు శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటరు జాబితాలో తమపేరు ఉన్నదీ లేనిదీ, ఏవైనా తప్పులున్నాయా? అన్న విషయాలను చెక్ చేసుకోవాలన్నారు. స్థానిక బిఎల్ఓ దగ్గర గానీ, ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా గానీ కొత్త ఓటరుగా నమోదుకోసం ఫారం- 6, సవరణలకు సంబంధించి ఫారం -8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ వెల్లడించారు. చనిపోయినవారి పేరు ఓటర్ల జాబితాలో తొలగించేందుకు ఫారం-7 వినియోగించాలని సూచించారు. ఈ ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకుని అర్హత కలిగిన వారందరూ తమ తమ పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్లకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డా.ప్రియాంక కోరారు.