Divitimedia
Bhadradri KothagudemSpecial ArticlesTelanganaWomen

కాగితాలకే పరిమితమవుతున్న ఐసీడీఎస్ కార్యక్రమాలు

కాగితాలకే పరిమితమవుతున్న ఐసీడీఎస్ కార్యక్రమాలు

భద్రాద్రి కొత్తగూడెం ఐసీడీఎస్ లో సంక్షోభం…

నాడు చడీచప్పుడు లేని తల్లిపాల వారోత్సవాలు… నేటి ‘పోషణ్ మాహ్-6’ పై నీలినీడలు…

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

పెనుసంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న భద్రాద్రి కొత్తగూడెం ఐసీడీఎస్ విభాగంలో ఏ కార్యక్రమాలు సక్రమంగా అమలు కాకుండా ‘కంటితుడుపు’గా మారిపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐసీడీఎస్ లో నేటి (సెప్టెంబరు 1వ తేదీ) నుంచి ప్రారంభం కావాల్సిన పోషణ్ మాహ్-6 కార్యక్రమాలపై నీలినీడలు కమ్ముకున్నాయి.జిల్లా సంక్షేమాధికారి(డీడబ్ల్యుఓ) పోస్ట్ విషయంలో చెలరేగుతున్న విమర్శలు, ప్రతి విమర్శలు జిల్లాలో ఐసీడీఎస్ పనితీరు దిగజారిపోయేలా చేస్తున్నాయి. గడిచిన తొమ్మిది నెలల కాలంలోనే మూడుసార్లు డీడబ్ల్యుఓ బాధ్యతలు మార్చాల్సిన దుస్థితి తలెత్తగా, అంతర్గత సంక్షోభానికి దారి తీసింది. జిల్లా సంక్షేమాధికారిగా స్వర్ణలతలెనినాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇది ఇష్టం లేని ఆమె సహ అధికారులు కొందరు ఈ వ్యవహారాన్ని రాజకీయం చేస్తుండటం విశేషం. ఇటీవలి సంక్షోభాన్ని తొలగించడం ద్వారా జిల్లాలో ఐసీడీఎస్ పనితీరు గాడిలో పెట్టేందుకు జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల డీడబ్ల్యుఓ మార్పు నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పు ఆ శాఖ పనితీరు మెరుగుపర్చే లోగానే చెలరేగుతున్న అంతర్గత రాజకీయ పరిస్థితులు సంక్షోభం మరింత తీవ్రతరంగా మార్చేస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలనే సవాల్ చేస్తున్న ఓ సీడీపీఓ చేస్తున్న రాజకీయంతో ఈ జిల్లాలో పరిణామాలు రాష్ట్రస్థాయిలో ప్రకంపనలు రేపుతున్నాయి. డెప్యుటేషన్ మీద జిల్లాకు వచ్చిన ఆ సీడీపీఓ ఐదేళ్ల నుంచి జిల్లాలోనే తిష్టవేసుకుని కూర్చుని మరీ రాజకీయం చేస్తున్నప్పటికీ, ఉన్నతాధికారులు కూడా ఆ సీడీపీఓను ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్న దుస్థితి ఏర్పడింది. సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఆమె ఐదేళ్లకు పైగా డెప్యుటేషన్ మీద ఒకేచోట కొనసాగుతున్నప్పటికీ, ఆమె వల్ల ఈ జిల్లా ఐసీడీఎస్ లో రాజకీయాలు తలెత్తి పనితీరు భ్రష్టుపట్టిపోతున్నప్పటికీ ఏమీ చేయలేకపోతున్నారు. కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆమె చేస్తున్న దుష్ప్రచారం ఉన్నతాధికారుల పని తీరు మీద కూడా ప్రభావం చూపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ గురించి దుష్ప్రచారం చేస్తున్న ఆ సీడీపీఓ తీరు పట్ల ఉన్నతాధికారులకు చెప్పుకోలేక, ఆమె ప్రాజెక్టులో తనిఖీలు చేసి, లోపాలను గుర్తించి వాటిని సరిచేయలేకపోతున్నారని తెలుస్తోంది. ఆ సీడీపీఓ మీద ఏదైనా చర్య తీసుకుంటే, ఆమె తన అవినీతి, అక్రమాల విషయాన్ని అందరూ మర్చిపోయే విధంగా, ఉన్నతాధికారుల ఆత్మస్తైర్యం దెబ్బతీసేలా లేనిపోనివి కల్పించి దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఇతర ప్రాజెక్టుల అధికారులకు, సిబ్బందికి కూడా ఉన్నతాధికారులంటే ఏమాత్రం లెక్క లేకుండా పోతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సీడీపీఓను ఆదర్శంగా తీసుకుంటున్న కిందిస్థాయి సిబ్బంది కూడా తమపై ఉన్నతాధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నపుడు, ఉన్నతాధికారులపైనే ‘రివర్స్’లో ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఉన్నతాధికారుల పైనే పోస్టులు పెడుతున్నారు. ఇంతటి క్రమశిక్షణ రాహిత్యం నెలకొని ఉండటంతో జిల్లాస్థాయి అధికారులు కూడా ఆత్మస్తైర్యం కోల్పోయిన దుస్థితిలో ‘తమకెందుకులే?’ అనే ధోరణిలో పర్యవేక్షణ పక్కన పడేస్తున్నారు. జిల్లాలో ఐసీడీఎస్ పనితీరు దుస్థితిలో పడేందుకు కారణమవుతున్నారు.


పోషణ్ మాహ్ సక్రమంగా కొనసాగేనా…?
———————————————
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐసీడీఎస్ లో ప్రస్తుతం నెలకొని ఉన్న సంక్షోభం కారణంగా సెప్టెంబరు 1వ తేదీ నుంచి నెలరోజులపాటు నిర్వహించాల్సిన ‘పోషణ్ మాహ్-6’ తీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లా ఐసీడీఎస్ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా, గత ఆగస్టు మొదటివారంలో చేపట్టిన ‘తల్లిపాల వారోత్సవాల’ నిర్వహణ నామమాత్రంగానే ‘మమ’ అనిపించారు. ఆగస్టు 1నుంచి 7వ తేదీ వరకు నిర్వహించాల్సిన వారోత్సవాల గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించడం తప్ప, పెద్దగా చెప్పుకోవాల్సినస్థాయి కార్యక్రమాలే నిర్వహించలేదు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామపంచాయితీలు, మున్సిపాలిటీల అధికారుల సహకారంతో ఓ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సి ఉన్న ఆ కార్యక్రమాలను ‘తూతూమంత్రం’ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 1 నుంచి నెలపాటు నిర్వహించాల్సి ఉన్న ‘6వ రాష్ట్రీయ పోషణ్ మాహ్‌’ కార్యక్రమాలపైన కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లాలో ఐసీడీఎస్ విభాగంలో ఈ దుస్థితిని మార్చే దిశగా జిల్లా కలెక్టర్, ఐసీడీఎస్ రాష్ట్రస్థాయి అధికారులు ఏం చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి మరి…

Related posts

ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలు

Divitimedia

ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

మద్యం బెల్టుషాపుల నిర్వాహకులు 32మంది బైండోవర్

Divitimedia

Leave a Comment