ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 200 తగ్గించిన కేంద్రం
దేశంలో 33కోట్ల మంది వినియోగదారులకు ప్రయోజనం
ఆగస్టు 30 నుంచి అమలులోకి రానున్న తగ్గిన ధర
✍🏽 దివిటీ మీడియా – న్యూదిల్లీ
కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ (వంటగ్యాస్) సిలిండరు ధరను రూ.200 తగ్గించింది. ఈ తగ్గిన ధర (14.2కిలోల సిలిండరుకు) వచ్చే 30వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన కేంద్రప్రభుత్వ కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగ వంటగ్యాస్ ధరను గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. 14.2 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం ఉన్న రూ.1103 నుంచి రూ.903కు తగ్గుతుంది. రక్షాబంధన్ సందర్భంగా దేశంలోని కోట్లాదిమంది సోదరీ మణులకు(మహిళలకు) ఇది తామిస్తున్న బహుమతిగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా అభివర్ణించారు. ఈ వంటగ్యాస్ ధర తగ్గింపు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గృహాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.200 సబ్సిడీకి అదనంగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. తాజా తగ్గింపు తర్వాత దిల్లీ నగరంలో సిలిండర్ రూ.703 అవుతుంది. దేశంలోని 9.6 కోట్ల మంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారుల కుటుంబాలు సహా 31 కోట్ల కంటే ఎక్కువ మంది దేశీయ ఎల్పీజీ వినియోగదారులందరికీ లాభంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న వారితోపాటు అదనంగా సహాయపడుతుందని గమనించవచ్చు. 75 లక్షల మంది పేదకుటుంబాలకు త్వరలోనే ఉజ్వల యోజన కింద ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు అందజేస్తామని, దీనివల్ల ప్రస్తుతం 9.6కోట్లుగా ఉన్న ఉజ్వల యోజన ఎల్పీజీ కనెక్షన్ల సంఖ్య 10.35 కోట్లకు చేరనుందని కేంద్రం ప్రకటించింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తమ ప్రభుత్వ నిర్ణయం ప్రకటిస్తూ, ఈ
నిర్ణయం సంతోషదాయకమన్నారు. ‘గృహ నిర్వహణలో సవాలుగా మారిన పరిస్థితిని అర్థంచేసుకున్న తమ ప్రభుత్వం వంటగ్యాస్ ధరల తగ్గింపుతో కుటుంబాలకు, వ్యక్తులకు ప్రత్యక్ష ఉపశమనాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రజల భారం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, ఈ వంటగ్యాస్ ధరల తగ్గింపు ప్రజల అవసరాలపై ప్రభుత్వ ప్రతిస్పందనకు, ప్రజల సంక్షేమంకోసం తమ ప్రభుత్వానికి ఉన్న అచంచలమైన అంకిత భావానికి నిదర్శనంగా అభివర్ణించారు.