Divitimedia
EducationHyderabadNational NewsTelangana

దేశ సమగ్రత కాపాడుకునేందుకు క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయండి

దేశ సమగ్రత కాపాడుకునేందుకు క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయండి

8వ జాతీయ రోజ్ గార్ మేళాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర సాయుధ బలగాల్లో 323 మందికి నియామక పత్రాలు

✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు

క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి, దేశ సమగ్రత, సమైక్యత కాపాడాలని, తద్వారా దేశసేవలో భాగస్వాములు కాబోతున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిశాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. నేటి నుంచి దేశ రక్షణ కోసం అంకితం కాబోతున్నందున అంకితభావంతో పనిచేస్తూ వారంతా ఉన్నతమైన వ్యక్తులు గా తీర్చిదిద్దబడతారని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం (ఆగస్టు 28) హకీంపేట సిఐఎస్ఎఫ్, ఎన్ఐఎస్ఏ, అంతరిక్ష ఆడిటోరియంలో నిర్వహించిన 8వ “రోజ్ గార్ మేళా” లో కేంద్రమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో నియామకపత్రాలు అందుకున్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి దేశానికి దిశానిర్దేశం చేస్తూ, 1000- 1200సంవత్సరాలక్రితం నుంచే మన దేశం మీద దాడులు, కుట్రలు జరిగిన విషయాన్ని గుర్తుచేశారన్నారు. అయినప్పటికీ మన దేశ సంస్కృతి,సంప్రదాయాలు, కళలు ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయన్నారు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా, దేశ సమగ్రత చెక్కుచెదరలేదన్నారు. భారతీయుల్లో ఉన్న జాతీయ భావన, యువతలో ఉన్న దేశభక్తి భావన, మనదేశ సమగ్రతను కాపాడేందుకు ఏదైనా చేయాలన్న సంకల్పమే ఇందుకు కారణమని తెలిపారు. నేడు శాస్త్రసాంకేతిక రంగాల్లో అమెరికాతో సమాన గౌరవాన్ని పొందుతున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. దానికి ఉదాహరణగానే ఇటీవల జాబిల్లిపై చంద్రాయాన్‌ ద్వారా అడుగు పెట్టడం గుర్తు చేశారు. యువతకు సాధికారత కల్పించడం ద్వారా గత వైభవాన్ని పున:ప్రతిష్టించుకునే దిశగా ప్రధానమంత్రి మోదీ సంకల్పించారని తెలిపారు. దేశానికున్న ప్రత్యేకతగా యువ బలాన్ని గుర్తించిన ప్రధానమంత్రి, యువత సామర్థ్యాన్ని దేశం కోసం సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన చేశారని కిషన్ రెడ్డి తెలియజేశారు. అవసరమైన నైపుణ్యాన్ని కల్పించడంతోపాటు సరైన అవకాశాలనూ కల్పించడం ప్రధానమంత్రి ఆలోచన అని తెలిపారు. దీనికి తగ్గట్లుగానే 9 ఏళ్ల నుంచి ఒక్కొక్కటిగా వ్యవస్థలో మార్పులు తీసుకు వస్తున్నామన్నారు. వచ్చే 25 సంవత్సరాల కాలం ‘అమృత కాలం’ అని దేశ చరిత్రలో ఇది అత్యంత కీలకమైన సమయమని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా యువతకు తెలియ జేశారు. అందువల్లనే బానిస ఆలోచనలను తొలగించుకుని, జాతీయవాద భావనలను మదిలో నింపుకుని యువత ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే మరోవైపు అంతర్జాతీయస్థాయి ప్రమాణాల కు అనుగుణంగా నైపుణ్యాన్ని అందిస్తూ ఉందన్నారు. ఉద్యోగాల కోసం వేచి చూసే పరిస్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి దేశ ప్రధాని యువతను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. “22అక్టోబర్ 2022 నాడు దేశ యువతకు దీపావళి కానుకగా ‘రోజ్‌గార్ మేళా’ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ప్రతి నెల 50 నుంచి 70వేల మందికి పైగా యువతకు నియామక పత్రాలు అందజేస్తూ ఈ మేళాను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. నేడు జరిగిన రోజ్‌గార్ మేళా ఎనిమిదవది. ఈ కార్యక్రమంతో కలుపుకుని మొత్తం 5.5లక్షల మందికి పైగా నియామక పత్రాలు అందించాం. మిగిలిన లక్ష్యాన్ని కూడా నిర్దేశిత సమయంలో చేరుకుంటాం. గతంలో ఉద్యోగాలంటే సిఫారసు ఉంటేనే వచ్చేది. కానీ నేడు ప్రతిభ ఆధారంగా, మీ కష్టం ఆధారంగా ఉద్యోగం మీదే అన్నట్లుగా ఉంది పరిస్థితి” అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) వంటి అధునాతనమైన సాంకేతికను ప్రభుత్వం విద్యావిధానంలోకి తీసుకొచ్చిందన్నారు. అదే సమయంలోనే ఎన్.ఇ.పి-2020 ద్వారా విద్యావిధానంలో నైతికత, సృజనాత్మకతకు కూడా పెద్దపీట వేసిందన్నారు. ఇలా గడిచిన తొమ్మిదేళ్లలో చాలా మార్పులు వచ్చాయని, వచ్చే 25ఏళ్ల అమృతకాలంలో మరింతగా శ్రమించి పని చేస్తే, భారతదేశాన్ని మళ్లీ ‘విశ్వగురువు’గా చూడడం మరింత సులువవుతుందని, ఈ దిశగా యువత సహకారం కావాలని కేంద్ర మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిఐఎస్ఎఫ్, సిఆర్‌పిఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్‌బి విభాగాల్లో ఉద్యోగాలు పొందిన 323 మంది అభ్యర్థులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఎస్ఏ డైరెక్టర్ సునీల్ ఇమ్మాన్యుయల్ తోపాటు సిఐఎస్ఎఫ్, సిఆర్‌పి‌ఎఫ్, ఐటిబిపి, ఎస్‌ఎస్‌బి కి చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

Related posts

ఆనందం వెతుక్కుంటూ… అథఃపాతాళానికి…

Divitimedia

కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి కేకే, ఆయన కూతురు మేయర్ విజయలక్ష్మి

Divitimedia

కొత్తగూడెం త్రీటౌన్ పోలీసుస్టేషన్ లో ఆకట్టుకున్న ‘ఓపెన్ హౌస్’

Divitimedia

Leave a Comment