నేడు కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో ‘రోజ్ గార్ మేళా’
51వేల మందికి నియామకపత్రాలు అందించనున్న ప్రధాని
✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు
కేంద్ర ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు అందించేందుకు సోమవారం (ఆగస్టు 28) ప్రత్యేక ‘రోజ్ గార్ మేళా’ నిర్వహించనున్నారు. హైదరాబాదు సిఆర్‌పిఎఫ్ పురుషుల క్లబ్, గ్రూప్ సెంటర్‌లో జరగనున్న ఈ 8వ విడత రోజ్ గార్( ఉపాధి) మేళాలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక వ్యవస్థాపకత, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ఉద్యోగాల్లో నియమించబడిన 51,000కు పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు. సోమవారం ఉదయం 10-30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆ పత్రాలు పంపిణీ చేసిన తర్వాత అభ్యర్థులనుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో జరగనున్న ఈ రోజ్ గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్), సశస్త్ర సీమా బల్ (ఎస్.ఎస్.బి), అస్సాం రైఫిల్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఢిల్లీ పోలీస్, తదితర కేంద్ర సాయుధ పోలీసు దళాల(సిఎపిఎఫ్) లో సిబ్బందిని నియమిస్తున్నారు. ఈ నియామకాలకు ఎంపికైనవారు దేశవ్యాప్తంగా హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ సంస్థల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), సబ్ ఇన్స్ పెక్టర్ (జనరల్ డ్యూటీ), నాన్ జనరల్ డ్యూటీ క్యాడర్ పోస్టుల్లో చేరనున్నారు. కేంద్ర సాయుధ పోలీసు దళాల (సిఎపిఎఫ్) తో పాటు ఢిల్లీ పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధం, తిరుగుబాటు, వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం, దేశ సరిహద్దులను రక్షించడం వంటి బహుముఖ పాత్రను మరింత ప్రభావవంతంగా పోషించడంలో ఈ దళాలకు సహాయపడుతుంది.
ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని ఇచ్చిన హామీ నెరవేర్చడంలో భాగంగా ఈ రోజ్ గార్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజ్ గార్ మేళా ఉద్యోగాల కల్పనను పెంపొందింప జేయడం తోపాటు యువత సామర్థ్యాలను దేశాభివృద్ధిలో సార్థకం చేయాలనే భావనతో ఉన్నట్లు చెప్తున్నారు. నూతనంగా ఉద్యోగాల్లో చేరినవారు కర్మయోగి పోర్టల్ లోని ఓ ఆన్ లైన్ మాడ్యూల్ ద్వారా శిక్షణ పొందే అవకాశం కల్పిస్తున్నారు.