పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
✍🏽 దివిటీ మీడియా – టేకులపల్లి
జిల్లాలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నందున శనివారం టేకులపల్లి మండలంలోని 158, 159, 160, 161 పోలింగ్ కేంద్రాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలు ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా నంబర్లు వేయించాలని చెప్పారు. అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని చెప్పారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఈ ఆగస్టు 26 శనివారం, 27 ఆదివారాల్లో జిల్లాలోని 1095 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితాను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా తన
ఓటును పరిశీలన చేసుకోవాలని చెప్పారు. జాబితా పరిశీలన తర్వాత ఏమైనా తప్పు నమోదులుంటే నిర్ణీత ఫారాల్లో సవరణలు, మార్పులు, చేర్పులకు దరఖాస్తు చేసుకునే విధంగా ఓటర్లకు అవగాహన కల్పించాలని బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. చనిపోయిన ఓటరు వివరాలు సేకరించి విచారణ తర్వాత నోటీసులు జారీ చేసి మాత్రమే తొలగించాలని సూచించారు. ఓటరు నమోదుకు క్షేత్రస్థాయిలో ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. టేకులపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలో జరుగుతున్న మన ఊరు – మన బడి పనులను కూడా కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణం అపరిశుభ్రంగా ఉందని, శుభ్రం చేయాలని పంచాయితీ అధికారులను ఆదేశించారు. మరమ్మతు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. విద్యార్థులతో ముఖాముఖి అయిన కలెక్టర్ మధ్యాహ్న భోజనం, విద్యా బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. మన ఊరు మన బడి పధకంలో బాగంగా ఈ పాఠశాలకు డైనింగ్ హాలు మంజూరు చేశామని, త్వరలో డైనింగ్ హాలు నిర్మాణం పూర్తి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వీరబాబు,మండల తహసీల్దార్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.