రైలులో మంటలు, 10 మంది మృతి, 20 మందికి గాయాలు
✍🏽 దివిటీ మీడియా – ఆన్ లైన్
తమిళనాడు రాష్ట్రంలోని మధురై రైల్వే స్టేషన్ సమీపంలో పునలూరు-మధురై ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగిన ఘటనలో 10మంది ప్రయాణికులు మృతి చెందారు. శనివారం ఉదయం రైలులోని పార్టీకోచ్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఈ 10 మందిని బలి తీసుకున్నట్లు చెప్తున్నారు. ప్రయాణికులు కొందరు తమతోపాటుగా అక్రమంగా వెంట తెచ్చుకున్న గ్యాస్ సిలిండరుతో కాఫీ కాచు కుంటున్న సందర్భంలో సిలిండర్ పేలినట్లు తెలుస్తోంది. పేలుడులో మంటలు వేగంగా వ్యాపించడంతో మొత్తం 10 మంది వరకు మరణించారు. ఆ మంటలను గమనించిన చాలామంది ప్రయాణికులు రైలు బయటకు వచ్చారని చెప్తున్నారు. మరి కొంతమంది ప్రయాణికులు మదురైలోని ఆర్‌డిఎం ప్లాట్ ఫారమ్‌లోనే దిగారని చెప్తున్నారు.
రైలులో తీసుకువెళ్లడంపై నిషేధం విధించిన వస్తువులు ఇవే…
రైలు ద్వారా ప్రమాదకరమైన వస్తువులను తీసుకువెళ్లడానికి భారతీయ రైల్వే చట్టంలో నియమాలున్నాయి. రైల్వే రెడ్ టారిఫ్ రూల్- 2000లో ఆ నియమాలు చట్టబద్ధం చేయబడ్డాయి, దీనిప్రకారం ప్రమాదకరమైన వస్తువులు 8 తరగతులుగా వర్గీకరించారు.
- పేలుడు పదార్థాలు
- కంప్రెస్ చేసిన వాయువులు (ద్రవీకృత, వత్తిడిలో కరిగిపోయేవి)
- పెట్రోలియం, ఇతర మండే ద్రవాలు.
- మండే స్వభావం గల ఘనపదార్థాలు.
- ఆక్సిడైజ్ చేసిన పదార్థాలు.
- విషపదార్ధాలు (టాక్సిక్ పదార్థాలు).
- రేడియో-యాక్టివ్ పదార్థాలు, ఆమ్లాలు, ఇతర తినివేసే స్వభావం ఉన్న పదార్థాలు.
- ప్రమాదకరమైన వస్తువులు, పదార్థాలు.