ఐసీడీఎస్ పనితీరు గాడిలో పడేదెన్నడో…?
ఏళ్ల తరబడి పాతుకుపోయిన సీడీపీఓను ఏమీ చేయలేకపోతున్న అధికారులు
ఏడాదికాలంలోనే ఎన్నో వివాదాలు, ఆరోపణలు
కఠినచర్యలు తీసుకుంటేనే కాస్తయినా మెరుగయ్యే పరిస్థితి
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
మెరుగైన భావిభారత సమాజ నిర్మాణం కోసం ఉపయోగపడే ఐసీడీఎస్ పథకంలోని అధికారులు, సిబ్బంది పనితీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అస్తవ్యస్తంగా మారడం పట్ల సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ‘యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్’గా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది పనితీరు పదే పదే తలెత్తే వివాదాలు, ఆరోపణలతో చర్చనీయాంశంగా మారుతోంది. ఏడాకాలం కూడా గడవకముందే ఈ జిల్లాలో ఐసీడీఎస్ పర్యవేక్షణ బాధ్యతలు చూసే జిల్లా స్థాయి ఉన్నతాధికారులిద్దరు క్రమశిక్షణ చర్యలకు గురికావడం సంచలనం సృష్టిస్తోంది. జిల్లా పరిధిలో ప్రధానంగా అంగన్ వాడీ కేంద్రాలు సక్రమంగా పనిచేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గతేడాది డిసెంబర్ నెలాఖరు లో అప్పటి జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా సంక్షేమాధికారి వరలక్ష్మిని సరెండర్ చేయగా తాజాగా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల కూడా జిల్లా సంక్షేమాధికారి సబితను సరెండర్ చేశారు. బదిలీపై వచ్చి ఇక్కడ బాధ్యతలు తీసుకున్న సబిత, విధుల్లో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ జిల్లా కలెక్టర్ ఆమెపై చర్యలు తీసుకున్నారు. కేవలం డీడబ్ల్యుఓ ను మారినంత మాత్రాన జిల్లాలో ఐసీడీఎస్ పనితీరు మెరుగుపడుతుందనుకోవడం అత్యాశే అవుతుంది. బూర్గంపాడు ప్రాజెక్టు పరిధిలో వివాదాలు, ఆరోపణల కారణంగా సీడీపీఓ ప్రమీలారాణిని అశ్వారావుపేటకు ఏసీడీపీఓగా పంపించిన తర్వాత పరిస్థితి మరింత ఘోరంగా దిగజారింది. పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో బూర్గంపాడు ప్రాజెక్టులో అంగన్ వాడీ కేంద్రాల పనితీరు మరింతగా దిగజారింది. సిబ్బందిని అదుపు చేసి పనితీరు మెరుగుపర్చే సమర్థత లేమి కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఈ బూర్గంపాడు ప్రాజెక్టుతోపాటు కీలకమైన పాల్వంచ ఐసీడీఎస్ ప్రాజెక్టులో పరిస్థితులు ఘోరంగా దిగజారాయి. అక్కడ అధికారుల అంతర్గత ఆధిపత్యపోరుతో అక్రమాలను నియంత్రించేవారే కరవయ్యారు. ఆధిపత్య పోరాటంలో ఎవరికివారు తమదే పైచేయి ఉండాలనే ఆరాటంలో పర్యవేక్షణ గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
—————————————————————————-
రాష్ట్రస్థాయి అధికారుల అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సీడీపీఓ…
—————————————————————————
పర్యవేక్షణ బాధ్యతలు సక్రమంగా చూడని అధికారులు కొందరు నిత్యం జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులను ప్రసన్నం చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రస్థాయి అధికారులతో ఉన్న సంబంధాలు, పలుకుబడి కారణంగా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా తమనేమీ చేయలేరనే ధీమాతో జిల్లాలో ఒక సీడీపీఓ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆ సీడీపీఓ ప్రవర్తనను చూసి మరికొందరు సీడీపీఓలు, పర్యవేక్షణ సిబ్బంది కూడా అదే రీతిలోనే రెచ్చిపోతున్న పరిస్థితులున్నాయి. చాలాకాలం నుంచి డెప్యుటేషన్ మీద ఇదే జిల్లాలో కొనసాగుతున్న ఆమెకు మహిళా, శిశు సంక్షేమశాఖ కమిషనరేట్ స్థాయిలో ఓ ఉన్నతాధికారి ఆశీస్సులు కూడా ఉన్నట్లుగా జిల్లాలో తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. ఆ అధికారి ఆశీస్సులతోనే తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆ సీడీపీఓ తన ప్రాజెక్టులో అంతో ఇంతో సాధ్యమైనంతలో ‘సిన్సియర్’ గా పనిచేసే పర్యవేక్షణ సిబ్బందిని, అంగన్ వాడీ టీచర్లు, సిబ్బందిని వేధిస్తున్నారు. ఆ ప్రాజెక్టు పరిధిలో ఆర్థిక వ్యవహారాలతో ఏ మాత్రం సంబంధం ఉన్న విషయాలైనా ఆమె సిబ్బందికి సంబంధం లేకుండా సొంతంగానే ‘డీల్’ చేసుకుంటూ అందినంతగా నిధులు తినేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అభాండాలు వేస్తూ దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల ఆ ప్రాజెక్టులోని దుస్థితి గురించి రాసిన పాత్రికేయుల పట్ల ఉన్నతాధికారుల వద్ద దుష్ప్రచారం చేసిన ఘనత కూడా ఆ సీడీపీఓ సొంతం. చాలా సంవత్సరాల నుంచి డెప్యుటేషన్ మీదనే ఈ జిల్లాలో కొనసాగుతున్న ఆమె కలెక్టర్ల మీదనే దుష్ప్రచారం చేసేటంతగా పాతుకు పోయి రాజకీయం చేస్తుండటంతో ఆమెపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు కూడా జంకుతున్నారనే ‘టాక్’ కూడా ఉంది. దీనికి తగినట్లుగానే మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు కూడా ఆ సీడీపీఓ మీద ఎన్ని ఆరోపణలు, వివాదాలు వచ్చినా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇంత దారుమైన పరిస్థితుల్లో ఆమె వేధింపులకు తట్టుకోలేక కొంతకాలం క్రితం అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. సంవత్సరాల తరబడి అదే ప్రాజెక్టులో కొనసాగుతూ ఉన్న ఆ సీడీపీఓ డెప్యుటేషన్ ను రద్దు చేసి పంపించేయాలని రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది. పదే పదే వివాదాలు, ఆరోపణలు వస్తున్నా ఆ సీడీపీఓను ఏమీ చేయలేకపోతున్న పరిస్థితుల్లో ఈ జిల్లాలో ఐసీడీఎస్ ప్రక్షాళన ఎలా సాధ్యమనే ప్రశ్నకు సమాధానం కరవైంది. ఇప్పటికైనా ఉన్నత స్థాయిలో కఠినచర్యలు తీసుకుంటే తప్ప, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐసీడీఎస్ పని తీరు గాడినపడే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే దుస్థితి కొనసాగితే మాత్రం ఈ జిల్లాలో చిన్నారులు, గర్భిణులు, బాలింత తల్లులకు పౌష్టికాహారం కూడా సక్రమంగా అందించలేని పరిస్థితులు ఏర్పడతాయని సామాజికవేత్తలు, మేధావులు చెప్తున్నారు.