Divitimedia
Bhadradri KothagudemSpecial ArticlesTelangana

ఇంతకీ మొక్కల ఉసురు తీసిన పాపమెవరిది…?

ఇంతకీ మొక్కల ఉసురు తీసిన పాపమెవరిది…?

తమవి కాదంటే తమవి కాదంటున్న పంచాయితీలు, ఫారెస్ట్ అధికారులు

విచారణ చేసే బాధ్యత ఉన్నతాధికారులకు లేదా?

✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు

         అక్కడ వారు చంపేసింది ‘మొక్కలను కాదు… హరితహారం ఉద్యమ స్పూర్తిని…’ అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. ఒక
వైపు తెలంగాణ ప్రభుత్వం హరితహారంతో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తుంటే, ఆస్పూర్తినే దెబ్బ తీసేవిధంగా ఉన్నారు కొందరు అధికారులు. బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో వేలసంఖ్యలో మొక్కలు గుట్టగా పారేసి ఎండిపోవడానికి కారకులు ఎవరనేది  అధికారులు ఇంతవరకు తేల్చనేలేదు. ఈ దారుణాన్ని ‘దివిటీ మీడియా’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం మీద అధికారులు ‘ఆరా’ తీసిన దాఖలాలు కూడా ఇప్పటి వరకు కనిపించకపోవడాన్ని బట్టి చూస్తే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది అర్థమవుతోంది. తెలంగాణ  ప్రభుత్వం ప్రతి సంవత్సరం మొక్కలు నాటేందుకు రు.కోట్లు   ఖర్చుపెడుతుంటే, అంత ఉన్నత లక్ష్యాన్ని ఇలా తూతూమంత్రంగా మార్చివేస్తున్నారు.  అధికారుల నిర్లక్ష్యం పెద్ద చర్చనీయాంశంగా మారింది. వేలసంఖ్యలో మొక్కలను అటవీ ప్రాంతంలో వృధాగా పడేసి, చంపేసిన వారు ఎవరనే విషయం తేల్చాల్సిన బూర్గంపాడు మండల అధికారులు, తమకేమీ సంబంధం లేదనే రీతిలో వ్యవహరిస్తున్నారు. మండల హరితహారం వ్యవహారాలను పర్యవేక్షించే ప్రత్యేకాధికారులు కూడా ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం పట్ల కూడా తీవ్రస్థాయి  విమర్శలు వస్తున్నాయి. హరితహారం పేరు మీద జిల్లాలో రూ.కోట్లు ఖర్చుపెట్టి ఏర్పాటు  చేస్తున్న నర్సరీలలో మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు కూడా పెద్దసంఖ్యలో మొక్కలను వృధాగా  పారేసి, చంపేసిన వ్యవహారంపు స్పందించక పోవడం గమనార్హం. ఈ మొక్కలు పారేసిన వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని కృష్ణసాగర్  గ్రామ పంచాయితీ కార్యదర్శి నవీన్ స్పష్టం చేశారు. తమ గ్రామం పక్కనే ఉన్న అటవీప్రాంతంలో ఎవరో తెచ్చి పడేసి వెళ్లడంతో తాము అభాసుపాలు కావాల్సి వస్తోందన్నారు. ఇదేవిధంగా తమకు కూడా దీంతో సంబంధం లేదని ముసలిమడుగు గ్రామ పంచాయితీ చెప్తున్న సమాధానం.   లక్ష్మీపురం గ్రామ పంచాయితీ కార్యదర్శి కిరణ్ కుమార్ కూడా మొక్కలు పడేసింది తాము కాదని చెప్తున్నారు. ఈ  పరిస్థితుల్లో  ‘దివిటీ మీడియా’ కృష్ణసాగర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీదేవిని సంప్రదించగా, తమ బీట్ ప్రాంతంలో మొక్కలు తెచ్చి పడేసిన వారు ఎవరనేది తెలియడం లేదన్నారు. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ మొక్కలుగా వ్యక్తమవుతున్న అనుమానాలపై స్పందిస్తూ, తమ డిపార్ట్ మెంట్ మొక్కలు ఆ విధంగా ఉండవంటూ స్పష్టం చేశారు. ఈ పరిస్థితులనుబట్టి చూస్తే 
కృష్ణసాగర్ అటవీప్రాంతంలో తెచ్చి పడేసిన మొక్కలు, పరిసర ప్రాంతంలోని  ఏదో ఒక గ్రామ పంచాయితీ నుంచి తెచ్చి పారేసినవే అనే విషయం స్పష్టమవుతోంది. అడవిలో  హరితహారం మొక్కలను తెచ్చి గుట్టలుగా పారేసిన విషయాన్ని ఆదివారం(ఆగస్టు 20) ‘దివిటీ మీడియా’ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇంత తీవ్రత కలిగిన  వ్యవహారం వెలుగుచూసినప్పటికీ, దీనిపై ఉన్నతాధికారులు నోరుమెదపకపోవడాన్ని చూస్తే నిర్లక్ష్యం ఏస్థాయిలో పేరుకునిపోయి  ఉందనేది అర్థం చేసుకోవచ్చు. మొక్కలు నాటే కార్యక్రమం ‘ప్రతిఏటా జరిగే ఓ తంతే కదా…?’ అనే భావన ఉన్నతాధికారుల్లోనూ ఉందేమోననే అనుమానాలు వ్యక్తమవుతూ  ఉన్నాయి. పారేసిన ఆ మొక్కలకు బాధ్యత ఎవరిదో? వాటిని ఏలెక్కల్లో రాసుకున్నారో? తేల్చాల్సిన ఉన్నతాధికారులు ఇప్పటివరకు  ఆ దిశగా చర్యలు ప్రారంభించలేదు. అసలు ‘హరితహారం కార్యక్రమానికి’ విలువే లేదా?, లేకపోతే ఆ మొక్కలు పెంచిన ప్రజాధనానికి విలువ లేదా? అని పర్యావరణ పరిరక్షకులు ప్రశ్నిస్తున్నారు. పచ్చని మొక్కలను చెట్లుగా పెంచడం ద్వారా పర్యావరణం కాపాడుకునే  లక్ష్యంతో ప్రభుత్వం ఖర్చుచేస్తున్న విలువైన   ప్రజాధనం ఇలా వృధా అవుతుండటం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణసాగర్ వద్ద   అటవీప్రాంతంలో మొక్కలు పారేసి, వృధా చేసినవారెవరనేది తేల్చి బాధ్యులపై కఠిన  చర్యలు తీసుకోకపోతే హరితహారం స్పూర్తి  ప్రమాదంలో పడుతుంది. గ్రామపంచాయితీ కార్యకలాపాలపై నిరంతరంగా పర్యవేక్షణ చేయాల్సిన మండల స్థాయి అధికారులు, తమ నిర్లక్ష్యం, పనితీరుకు అద్దంపడుతున్న ఈ మొక్కల వృధా వ్యవహారంపై వాస్తవాలు తేల్చాల్సిన బాధ్యత ఉంది. అడవిలో వృధా  చేసిన ఈ మొక్కల పాపం ఏ పంచాయతీదో తేల్చాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది.  ఈ నెల 26వ తేదీన తెలంగాణ ప్రభుత్వమే  అధికారికంగా ‘కోటివృక్షార్చన’ పేరుతో ఒక మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈపరిస్థితుల్లో అడవిలో మొక్కలు వృధాగా పారేసిన వ్యవహారం నిగ్గుతేల్చి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని  సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
———————————————————-
అడవిలో మొక్కలు పారేసింది ప్రయివేటు వ్యక్తులంట…
———————————————————-
మొక్కలను వృధాగా అడవిలో పారేసింది ప్రయివేటు వ్యక్తులని భావిస్తున్నామని బూర్గంపాడు ఎంపీడీఓ వివేక్ రామ్ ‘దివిటీ మీడియా’తో చెప్పారు. తాము పంచాయితీ కార్యదర్శులను విచారించామని, ఎవరూ తమ తమ పంచాయితీ మొక్కలు వృధాగా పారేయలేదని చెప్తున్నారన్నారు. ఆయన చెప్తున్న సమాధానం పరిశీలిస్తే అనుమానం కలుగుతోంది. ఉన్నతాధికారులు ఇందులో చర్యలు తీసుకుంటారేమోననే భయంతోనే అధికారులు ఈ విధంగా దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారనే అనుమానాలు కలుగు తున్నాయి. ఆ అటవీప్రాంతంలో పారేసిన మొక్కలలో రకరకాల పండ్లమొక్కలున్న నేపథ్యంలో అవి ప్రయివేటు నర్సరీల వారి మొక్కలు కాదని అర్థమవుతోంది. అసలు ఎంతో ఖర్చు చేసి పెంచిన పండ్లమొక్కలు పారేయాల్సిన అవసరం ప్రయివేటు నర్సరీ వారికేం ఉంటుందనేది అధికారులే చెప్పాలి మరి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ మొక్కలు మండలంలోని ఓ పంచాయితీకి సంబంధించినవని తెలుస్తోంది. ప్రజలకు పంచిపెట్టి నాటించాల్సిన మొక్కలను అదే గ్రామపంచాయితీ ట్రాక్టరులో తెచ్చి అటవీ ప్రాంతంలో పడేశారని, అది చూసిన వారు ఆ గ్రామ పంచాయితీకి చెందిన సిబ్బందిలో ఒకరు విషయం బయటకు తెలియజేశారని చెప్తున్నారు. పైగా ప్రయివేటు నర్సరీవారైతే అడవిలో అంత లోపలకు తీసుకున్న వెళ్లి, అక్కడ పారేయడంతోపాటు వాటినెవరూ చూడకూడదని, వాటిపై చెట్ల కొమ్మలు వేసి ఎందుకు కప్పేస్తారనే సందేహాలున్నాయి. ఆ మొక్కలు నాటించడం భారంగా భావించిన గ్రామ పంచాయితీ సిబ్బందే వాటిని గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్లి అడవిలోపల పారేసి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు అడవిలో పారేసిన మొక్కల వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే అసలు లక్ష్యం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, దీనిపై విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజికవేత్తలు కోరుతున్నారు.

Related posts

హామీలు నెరవేర్చడంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు…!

Divitimedia

మాతా శిశు ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Divitimedia

విద్యార్థులలో సామర్ధ్యాలు పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే

Divitimedia

Leave a Comment