చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినచర్యలు
జిల్లా నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ డా.వినీత్ ఆదేశాలు
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, ప్రత్యేక నిఘాతో నేరస్తులను గుర్తించి వారిపై చట్టం ప్రకారం కఠినచర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జిల్లాలోని పోలీసు అధికారులతో ఎస్పీ నేరాల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ వినీత్ మాట్లాడుతూ, నేరస్తులకు శిక్ష పడేవిధంగా కృషిచేసి బాధితులకు సత్వరం న్యాయం చేకూర్చేలా పోలీసు అధికారులు అందరు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా విజిబుల్ పోలీసింగ్ తో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలనిఆదేశించారు. ఈ జిల్లాలో సామాన్యప్రజానీకానికి ఇబ్బందులు కలిగించేలా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గంజాయి రవాణా, మట్కా, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.వ్యవస్తీకృత నేరాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ముందస్తుగా వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలలో భద్రత కోసం షీటీముల ఆవశ్యకత గురించి జిల్లా వ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. స్థానిక పోలీస్ అధికారులు తమ స్టేషన్ల పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని నిరంతరం సందర్శిస్తూ ఉండాలని, ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టి, పోలీస్ శాఖపై నమ్మకాన్ని మరింతగా పెంచాలని కోరారు. వర్టికల్స్ వారీగా విధులలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు,సిబ్బందికి ప్రసంసాపత్రాలు అందజేశారు. ఈ నేరాల సమీక్షా సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్, డీఎస్పీలు వెంకటేష్, రమణమూర్తి, రాఘవేంద్రరావు, రెహమాన్, మల్లయ్యస్వామి, జిల్లాలోని సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.