ప్రశాంతంగా ముగిసిన మద్యం షాపుల కేటాయింపులు
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం లాటరీ పద్ధతిలో, పారదర్శకంగా మద్యం దుకాణదారులను ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ డా ప్రియాంక తెలిపారు. పాల్వంచ జెన్కోకాలనీలో ఉన్న భద్రాద్రి ఆడిటోరియంలో జిల్లా ఆబ్కారీశాఖ ఆధ్వర్యంలో 88 దుకాణాల కేటాయింపు కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఆబ్కారీ శాఖ ఆగస్టు 4వ తేదీనుంచి 18వ తేదీలోగా మద్యం దుకాణాల నిర్వహణకు లైసెన్సుల కోసం దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 88 మద్యం దుకాణాలకుగాను 5057 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ ప్రక్రియ అత్యంత భద్రత, ఆసాంతం వీడియోచిత్రీకరణ నడుమ పూర్తి చేసినట్లు చెప్పారు. లాటరీ ప్రక్రియ మొత్తం దరఖాస్తు దారులు వేక్షించేందుకు వీలుగా ఎల్ఈడీ టీవీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా, రద్దీ నియంత్రణ కోసం ముందస్తుగా పాసులు జారీ చేశామన్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య ప్రశాంతమైన వాతావరణంలో లాటరీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, జిల్లా అబ్కారీశాఖ అధికారి జానయ్య, జిల్లాలోని అబ్కారీశాఖ సీఐలు, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.