ఆదివాసీ విద్యార్థికి హర్యానా రాజ్ భవన్ ఆతిథ్యం
కొర్సా లక్ష్మిని ఆహ్వానించిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
తల్లితండ్రుల కష్టం, తన ప్రతిభతో బీహార్
రాజధాని పాట్నాలోని ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు సాధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆదివాసీ విద్యార్థిని కొర్సా లక్ష్మి, హర్యానా రాజ్ భవన్ కు వచ్చి, ఆతిథ్యం స్వీకరించాలని ఆహ్వానం అందుకున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆమెకు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించి ఆశ్చర్యపరిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కాటాయగూడెం గ్రామానికి చెందిన “కొర్సా లక్ష్మి”ని టెలిఫోన్ ద్వారా మాట్లాడుతూ గవర్నర్ దత్తాత్రేయ ‘శబ్బాష్ లక్ష్మి’ అంటూ అభినందించారు. ఆ రాజ్ భవన్ ఆతిధ్యం స్వీకరించాలని కోరిన ఆయన భవిష్యత్తులో అన్నివిధాలుగా తన సహాయ సహకారాలందిస్తానంటూ భరోసా కూడా కల్పించారు. ఆదివాసీ దంపతులైన కన్నయ్య, శాంతమ్మ దంపతుల కూతురైన లక్ష్మి నిరుపేద కుటుంబంలో జన్మించినా ఏ పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోకుండా పట్టుదల, ఇష్టంతో కష్టపడి చదివి ప్రతిభతో ప్రతిష్టాత్మకమైన పాట్నా ఐఐటీలో ప్రవేశం సాధించడంపై దత్తాత్రేయ సంతోషం వ్యక్తం చేశారు. లక్ష్మి తండ్రి కన్నయ్య సమీపంలోని గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఐస్ క్రీంలు విక్రయించి, కుటుంబాన్ని పోషిస్తున్నారని, ఆమె తల్లి ఇంటి బాధ్యతలు చూసుకుంటూ కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్నారు. వారికి చదువు లేకపోయినా, తమ కూతురు లక్ష్మి జీవితంలో ఎదగడానికి అన్ని అవకాశాలను అందించాలన్న తాపత్రయంతో ప్రోత్సాహం అందించారని గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రశంసించారు. భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఉన్నత విద్యాసంస్థలో సీటు సంపాదించిన లక్ష్మి తల్లిదండ్రుల కలలను నిజం చేయడం అభినందనీయమంటూ ఈ సందర్భంగా దత్తాత్రేయ పేర్కొన్నారు. స్థానిక గురుకులంలో 7వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యనభ్యసించిన లక్ష్మి, తన చదువు పట్ల ఉన్న నిబద్ధత ఫలితంగా ఎస్.ఎస్.సి పరీక్షలలో 10/10 జీపీఏ సాధించడం గర్వ కారణమని, 2021-23 విద్యాసంవత్సరం ఇంటర్మీడియట్(ఎంపీసీ) పరీక్షలలో 1000కి 992 మార్కులు సాధించడం విశేషమని ఈ సందర్భంగా ప్రశంసించారు. భద్రాచలంలోని ట్రైబల్ గురుకుల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఒఇ)లో నైపుణ్యం కలిగిన బోధకుల మార్గదర్శకత్వంలో జేఈఈ మెయిన్స్ తో పాటు అడ్వాన్స్డ్ పరీక్షలకోసం అహర్నిశలు కష్టపడి చదివి, ఇటీవల జరిగిన జేఈఈలో పరీక్షలో 1371వ ర్యాంక్ సాధించి, పాట్నా ఐఐటీలో బీటెక్(ఇఇఇ) ప్రోగ్రామ్ లో సీటు సంపాదించడంపై ఆమె సాధించిన విజయం తెలుగుబిడ్డగా మనందరికీ గర్వకారణమని బండారు దత్తాత్రేయ కొనియాడారు. లక్ష్మి సాధించిన విజయాలు ప్రతిచోట యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని, సవాళ్లతో కూడిన కుటుంబనేపథ్యంలో కూడా శ్రేష్ఠత సాధించేందుకు ఎలాంటి అవధులు లేవని ఆమె నిరూపిస్తుందని, తన ప్రతిభతో లక్ష్మి అందరి మనసులు గెల్చుకుందని, ఐఐటీ పరీక్షల్లో అసాధారణ ప్రతిభ కనబర్చినందు వల్ల భవిష్యత్తులో తన ప్రతిభతో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తాను కోరుకుంటున్నట్టు దత్తాత్రేయ తెలిపారు.