డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద పేదల దీక్షలు
మధ్యవర్తుల జోక్యంతో నష్టపోతున్నామని లబ్ధిదారులు ఆవేదన
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం
భద్రాచలంలోని స్థానిక మనుబోతుల చెరువులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద లబ్ధిదారులు చేపట్టిన నిరసనదీక్ష ఐదు రోజుల నుంచి కొనసాగుతోంది. దీక్షల శిబిరంవద్ద శనివారం ఎమ్మార్పీఎస్ మండల నాయకుడు అలవాల రాజా మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు అవుతున్నప్పటికీ పేదలకు సొంతింటి కల నేటికీ కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు అనేక పథకాలు ప్రకటించినప్పటికీ లక్ష్యాలను సాధించడంలో ఈ ప్రభుత్వాలు ముందడుగు వేయలేకపోయాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పేద ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం పేదప్రజలకి ఇల్లు నిర్మించి ఇవ్వడంలోనూ, పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. పూర్తయిన ఇళ్ల కేటాయింపులలో అవకతవకలు, నిర్మాణ నాణ్యతలోపాలతో నిజమైన లబ్ధిదారుల్ని ఎంపిక చేయకుండా పోవడం వల్ల పథకం అసలు లక్ష్యం దెబ్బ తిన్నదని ఆరోపించారు. ఇక్కడ రాజకీయ నాయకుల, దళారుల, మధ్యవర్తుల జోక్యం వల్ల నిజమైన లబ్దిదారులు ఇల్లు పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భద్రాచలంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిరుపేదలకు ఎవరి జోక్యం లేకుండా నేరుగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఆగస్టు 15న లబ్ధిదారులు తీసుకోబోయే ఏ నిర్ణయమైనా ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకోసం లబ్ధిదారులు చేస్తున్న పోరాటానికి రాజకీయనాయకులు, ప్రజాసంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అలవాలరాజా పెరియార్, తెల్లం సమ్మక్క, మేకల లత, కొచ్చర్ల కుమారి, గద్దల కృష్ణవేణి, మిర్యాల రమాదేవి, కొప్పుల నాగమణి, గుండె సుహాసిని, బానోత్ లక్ష్మి, కృష్ణవేణి, ఇల్లందుల హేమలత, మేరీ, సమత, స్వప్న, గట్టు కాంతారావు, హనుమంతు, పెదబాబు, బాబా, పద్మ, శిరీష, తదితరులు పాల్గొన్నారు.