సంక్షేమం మాటున చక్కగా వసూళ్లు…
‘ఐసీడీఎస్’లో అధికారుల వసూళ్ల దందా
ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న అవినీతి భాగోతాలు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 10)
ఐసీడీఎస్ అధికారుల అవినీతి దాహం వెర్రితలలు వేస్తోంది… నిరుపేద మహిళలు, చిన్నారుల సంక్షేమం చూడాల్సిన ఆ శాఖాధికారులు, యధేచ్ఛగా అవినీతి, అక్రమాలకు తెగబడుతున్నారు… అందినకాడికి అడ్డూ అదుపూ లేకుండా దోచుకుతింటున్న తీరు విస్మయం కలిగిస్తోంది… తమ భాగోతాలు బయటపెట్టినవారిపైనే బురదజల్లుతూ ఉన్నతాధికారులనే బురిడీ కొట్టిస్తున్న అక్రమార్కులు తేలికగా తప్పించుకుంటున్నతీరు చూసి మరికొందరు స్పూర్తి పొందుతున్నారు… ‘ఐసీడీఎస్’కు అర్థాన్నే మార్చేసి, ‘ఇంటెన్సివ్ కరప్షన్ డెవలప్ మెంట్ స్కీమ్’ అనిపించుకుంటున్నారు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల ఒక్కొక్కటిగా బయట పడుతున్న ఆ శాఖలోని అధికారుల అవినీతి, అక్రమాలపై ‘దివిటీ మీడియా’ ప్రత్యేక కథనం…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఇటీవల కొందరు అంగన్వాడీ టీచర్లకు, వారి సూపర్వైజరుకు మధ్య తలెత్తిన వివాదం ఆ ప్రాజెక్టులో అధికారుల ‘వసూళ్ల పర్వం’ బయటపడేలా చేసింది. ఆ ప్రాజెక్టులో గతంలో పనిచేసిన సీడీపీఓ, అంగన్వాడీ టీచర్ల నుంచి నెలవారీ ముడుపులు వసూలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల తనిఖీలలో తన దృష్టికి వచ్చిన అవకతవకలపై చర్యలు తీసుకోకుండా ఉండటం కోసం సీడీపీఓ ప్రతినెలా ఒక్కొక్క అంగన్వాడీ టీచర్ నుంచి రూ.3,000 వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్టులో తనకు నమ్మకంగా ఉంటూ మధ్యవర్తులుగా వ్యవహరించేలా కొందరు అంగన్వాడీ టీచర్లను ఎంపిక చేసుకుని మరీ ఆ సీడీపీఓ తన ‘దందా’ సాగించినట్లు బయటపడింది. అంగన్వాడీ టీచర్ల బ్యాంకు ఖాతాల్లో నుంచి ‘డిజిటల్ పేమెంట్ల’ ద్వారా డబ్బులు వసూలు చేసినట్లు వెలుగుచూడటం సంచలనం సృష్టిస్తోంది. తమ సూపర్ వైజర్ మీద కొందరు అంగన్వాడీ టీచర్లు చేసిన ఫిర్యాదుపై విచారణ సందర్భంగా ఈ వసూళ్ల భాగోతం బయటకు రావడం గమనార్హం. ఆ సీడీపీఓ, ఆ ప్రాజెక్టులోని మరికొందరు ఉద్యోగులు ఈ వసూళ్ల భాగోతంలో తలమునకలై దాదాపు ఏడెనిమిదేళ్లుగా అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ గాలికొదిలేసినట్లుగా అర్థమవుతోంది. ఇటీవల అధికారులు మారడం, తమ సూపర్ వైజర్ మీద అంగన్వాడీ టీచర్లు ఫిర్యాదు చేసి విచారణ జరగడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఆ వివాదంపై జరిగిన విచారణలో ఈ అక్రమ వసూళ్లకు సంబంధించిన విషయం బయటపడింది. కాకపోతే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిందో? లేదో? తెలియడం లేదు. ఒకవేళ దీనిపై సమాచారం వచ్చినా ఉన్నతాధికారులు కూడా గుట్టుచప్పడు కాకుండా తమ వాటాలు తీసుకుని బాధ్యులపై చర్యలేమీ లేకుండానే కప్పిపుచ్చారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
*
టేకులపల్లి ప్రాజెక్టులోనూ బయటపడిన అక్రమాలు…
*
టేకులపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఇటీవల అక్రమాలు వెలుగు చూశాయి. అనారోగ్యం కారణంగా కొన్ని నెలల పాటు విధులకు గైర్హాజరైన అంగన్వాడీ టీచర్లను మళ్లీ విధుల్లోకి తీసుకునేందుకు అక్కడి సీడీపీఓ రూ.1.50 లక్షల నుంచి రూ.3లక్షల దాకా దండుకుంటున్నారనేది బయటపడింది. దాదాపు రెండేళ్ల నుంచి అంగన్వాడీలో విధులకు దూరంగా ఉన్న టీచర్ ను తొలగించకుండా ఆమె విధుల్లోనే ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదిక పంపడం విశేషం. ఈ వ్యవహారంలో సీడీపీఓతో పాటు అక్కడి కార్యాలయ ఉద్యోగులు కూడా పాత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మినీ అంగన్వాడీ సెంటర్ల ‘అప్ గ్రేడేషన్’ ప్రక్రియలో ఆ సెంటర్ కూడా ‘మెయిన్’గా మారడంతో ఆ అంగన్వాడీ టీచర్ ను తిరిగి విధుల్లోకి తీసుకుంటామంటూ ఆశ చూపించి భారీగా వసూళ్లు చేశారు. డబ్బులు దండుకున్న అధికారులు ఎంతకూ తమకు పనిచేసి పెట్టకపోవడంతో వారిచుట్టూ అనేక మార్లు తిరిగిన బాధితులు ఈ వ్యవహారాన్ని బయట పెట్టారు. ఈ అక్రమ వసూళ్లపర్వంలోనూ అధికారులు ‘డిజిటల్ పేమెంట్ల’ రూపంలో దండుకోవడంతో బాధిత టీచర్ల ఆరోపణలకు బలం చేకూరింది. అక్రమ బయట పడటంతో ఆ సీడీపీఓ, ఆ డబ్బులు తిరిగిచ్చే క్రమంలో మళ్లీ ‘డిజిటల్ పేమెంట్’ చేసి పక్కాగా దొరికిపోవడం విశేషం. జిల్లా సంక్షేమాధికారి (డీడబ్ల్యుఓ) ఇటీవల చేసిన విచారణలో ఈ అక్రమాలు బయటపడినట్లుగా తెలుస్తోంది. కాకపోతే బాధ్యులపై ఇంతవరకు చర్యలు మాత్రం తీసుకోకపోవడం గమనార్హం. జిల్లా ఐసీడీఎస్ విభాగంలో మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన కొన్ని అవినీతి, అక్రమాలు కూడా త్వరలోనే బయటకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.