కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయండి
సీఎం రేవంత్ రెడ్డిని కోరిన మంత్రి తుమ్మల
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 6)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఇప్పటికే ఉన్న కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ను ‘యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్’ గా అప్ గ్రేడ్ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు తుమ్మల బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగూడెంలో అనేక పారిశ్రామిక సంస్థలున్నాయని, సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రధానకార్యాలయం, టీఎస్ జెన్కో, నవభారత్ వెంచర్స్, బయ్యారం మైన్స్, మైలారం కాపర్ మైన్స్, ఎన్.ఎం.డి.సి లాంటివి ఉన్నాయని తెలియజేశారు. కొత్తగూడెం ఇప్పటికే జిల్లా కేంద్రంగా, గ్రీన్ ఫీల్డ్, నేషనల్ హైవేలతో రవాణా వ్యవస్థకు అనువైన ప్రాంతమని ఆయన పేర్కొన్నారు. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని, రాష్ట్రంలోని అన్నిప్రాంతాల విద్యార్థులకు కొత్తగూడెం యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి తుమ్మల చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయన్నారు. అప్ గ్రేడ్ చేసిన యూనివర్సిటీలో యూజీ, మాస్టర్స్, పి.హెచ్.డి ప్రోగ్రాంలలో భూగర్భశాస్త్రం, ఎన్విరాన్ మెంటల్ సైన్స్, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ లాంటి ప్రోగ్రాంలు అదనంగా చేర్చి ప్రత్యేక విద్య, శిక్షణ అందించాలని కోరారు. ఈ విధంగా చేసినట్లయితే ఆ అంశాల్లో భారతదేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ అవుతుందని మంత్రి పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ద్వారా విద్యార్థులకు ఎర్త్ సైన్స్ లో మంచి విద్యనందించడంతోపాటు, ఆర్థికాభివృద్ధి, నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికి, పర్యావరణం కాపాడుతూ, ఇండస్ట్రీ, విద్య రెండిటినీ సమన్వయం చేసుకుంటూ విద్యనభ్యసించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు.
దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ, మంత్రి కోరిన విధంగా త్వరలోనే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.