డీఎస్పీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్
అనుమానితుల సమాచారమివ్వాలన్న డీఎస్పీ సతీష్
23 మోటారుసైకిళ్లు, 3 ఆటోలు, కారు స్వాధీనం
✍️ బూర్గంపాడు – దివిటీ (అక్టోబరు 18)
బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సారపాక గాంధీ నగర్ లో శుక్రవారం పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో పోలీసులు ‘కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్’ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీనగర్ లోని ప్రతిఇంటిని సోదాచేసి, ప్రతి ఒక్కరి వివరాలను అడిగి నమోదు చేసుకున్నారు. మొత్తం 210 ఇళ్లను సోదా చేయగా సరైనపత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, ఒక కారును కూడా పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులనుద్ధేశించి పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, గ్రామంలో ఎవరైనా కొత్తవ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారమందించాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం ఎప్పటికప్పుడు పోలీసులకు అందించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గ్రామస్తులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో పాల్వంచ సీఐ వినయ్ కుమార్, బూర్గంపాడు ఎస్ఐ రాజేష్, పాల్వంచ రూరల్ ఎస్సై సురేష్, కొత్తగూడెం వన్ టౌన్ ఎస్ఐ విజయ, స్పెషల్ పార్టీ సిబ్బంది 70 మంది పాల్గొన్నారు.