గణేష్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు

✍️ దివిటీ (భద్రాచలం) ఆగస్టు 28
గణేష్ నవరాత్రుల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలంలో గోదావరి నదికి గణేష్ నిమజ్జనోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగ కుండా ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఈ మేరకు భద్రాచలం గోదావరి కరకట్ట వద్ద జరుగుతున్న నిమజ్జనోత్సవ ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. అక్కడున్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారుతున్నందున పరిసర ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి నదీ ప్రవాహాన్ని వీక్షించేందుకు కరకట్ట మీదకు ఎవరూ రాకూడదని సూచించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో కరకట్ట మీద ఎవరైనా సంచరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కరకట్ట పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. వినాయక ప్రతిమలను నిమజ్జనానికి తీసుకొచ్చే ఉత్సవకమిటీ సభ్యులు పోలీసు వారి సూచనలను పాటిస్తూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, భద్రాచలం సీఐ నాగరాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.