రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు

వేర్వేరు కేసులలో ఏసీబీకి పట్టుబడిన ముగ్గురు ఉద్యోగులు
✍️ హైదరాబాద్ – దివిటీ (ఆగస్టు 19)
రంగారెడ్డి జిల్లాలో మంగళవారం ఏసీబీ అధికారులు జరిపిన దాడులలో రెండు వేర్వేరు కేసులలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏసీబీ ప్రకటించిన వివరాలిలా ఉన్నాయి… రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం తహశీల్దారు చింతకింది లలిత, మండల సర్వేయర్ కోట రవి కలిసి ఓ వ్యక్తికి (ఫిర్యాదుధారుడికి) తన అమ్మమ్మ గారికి సంబంధించిన భూమి నమోదు కోసం, భూ రికార్డులలోని ముద్రణాలోపాలకు సవరణలు చేయడానికి ఫిర్యాదుధారుని నుంచి మొదటగా రూ.1లక్ష లంచంగా డిమాండ్ చేశారు. ఇప్పటికే రూ.50వేలు తీసుకుని, మిగతా రూ.50వేల లంచం తీసుకుంటూ మంగళవారం తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు.
రంగారెడ్డి జిల్లా తాండూరులో మరో కేసులో పురపాలకసంఘం కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ బి.రమేష్, ఏసీబీకి పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడు తాను నిర్మించుకున్న ఒక షెడ్డుకు సంబంధించి ఇంటినెంబరు కేటాయించడానికి అతని నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటూ రమేష్, తెలంగాణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ప్రభుత్వ సేవకులెవరైనా తాము తప్పక చేయాల్సిన పని చేసేందుకుగాను లంచం అడిగినట్లయితే ప్రజలు తెలంగాణ రాష్ట్ర అవినీతినిరోధకశాఖ(ఏసీబీ) వారి “టోల్ ఫ్రీ నెంబర్ – 1064 కు డయల్ చేసి తగు సమాచారం అందించాలని” ఏసీబీ రాష్ట్ర విభాగం అధికారులు కోరుతున్నారు. ఆ విభాగం సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్(నెంబర్ 9440446106), ఫేస్ బుక్ ఖాతా- Telangana ACB, ఎక్స్ ఖాతా @TelanganaACB, వెబ్ సైట్ – acb.telangana.gov.in ద్వారా కూడా తెలంగాణ ఏసీబీని సంప్రదించవచ్చునని వివరించారు. తమకు ఫిర్యాదులు చేసే వారి, బాధితుల వివరాలు కూడా తాము గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.