Divitimedia
HyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTelangana

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం

✍️ హైదరాబాద్ – దివిటీ (జులై 10)

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశం తీర్మానించింది. ఇందుకు సంబంధించి ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ అంశంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం చర్చించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించింది. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత మార్చి నెలలో జరిగిన సమావేశాల్లో బిల్లులకు శాసనసభ ఆమోదించి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి నివేదించిన విషయం ప్రస్తావనార్హం. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటివరకు జరిగిన 18 మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు తీరుపైనా సమావేశం చర్చించింది. గతంలో జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో ప్రధానమైన 23 శాఖలకు సంబంధించి 327 అంశాలపై తీసుకున్న నిర్ణయాల్లో 321 నిర్ణయాలు అమలు జరగగా మిగిలిన ఆరింటిపై మంత్రిమండలి అవసరమైన వివరణను ఇచ్చింది. ఇకనుంచి ప్రతి రెండు వారాలకు ఒకసారి విధిగా మంత్రివర్గం సమావేశం కావడమే కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్ణయాల అమలును సమీక్షించాలని కూడా తీర్మానించింది. రాష్ట్రంలోని 306 గోశాలల నిర్వహణపై ఓ సమగ్రమైన పాలసీ తీసుకురావాలని నిర్ణయించారు.
చివరి దశలో అసంపూర్తిగా ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణ ప్రక్రియ సత్వరం పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఈ సమావేశం నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.

Related posts

బాలల హక్కులు, సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

Divitimedia

నిబంధనలతో మాకు పనేంటి…?

Divitimedia

ప్రయాణికుడికి రూ.10వేలు చెల్లించాలని మెట్రో రైలు యాజమాన్యానికి ఫోరం ఆదేశం

Divitimedia

Leave a Comment