గుంటూరు బాలికకు పీఎం బాల పురస్కార్
క్రీడావిభాగంలో సాధించిన జెస్సీరాజ్
✍️ గుంటూరు – దివిటీ (డిసెంబరు 26)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు నగరానికి చెందిన 14ఏళ్ల బాలిక జాతీయస్థాయిలో ‘పీఎం బాల పురస్కార్’ సాధించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించి, రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు అందజేశారు. ఈ అవార్డు అందుకున్నవారిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైనది జెస్సీరాజ్ మాత్రపు ఒక్కరే కావడం విశేషం. ఆమె తనలోని స్కేటింగ్ ప్రతిభతో, కళాత్మక స్కేటింగ్ రంగంలో అసాధారణ మైలు రాళ్లు సాధించి, భారతదేశంలో అత్యంత ప్రకాశవంతమైన ప్రతిభావంతులలో ఓ సముచిత స్థానం సంపాదించుకుంది. ఆ బాలిక అంతర్జాతీయ వేదికపై, అత్యంత ప్రతిష్టాత్మకమైన “వరల్డ్ స్కేట్ ఓషియానియా ఆర్టిస్టిక్ ఛాంపియన్‌షిప్” లో 31.98 పాయింట్ల ఆకట్టుకునే స్కోర్ తో బంగారు పతకం కైవసం చేసుకుంది. జాతీయంగా, ఆమె 59వ జాతీయస్థాయి పోటీల్లోనూ ఆధిపత్యం చెలాయించింది, వరుసగా మూడు సంవత్సరాలు (2021 నుంచి 2023 మధ్య) అగ్ర స్థానాలను కైవసం చేసుకుంది. ప్రాంతీయస్థాయిలో తూర్పుగోదావరిజిల్లా(2023)లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు, కాంస్య పతకాలు సాధించింది. అంతర్జాతీయ, జాతీయ, జిల్లాస్థాయిల్లో జరిగిన పోటీల్లో జెస్సీరాజ్ 43 పతకాలు సాధించి, ఆమె అసాధారణ విజయాలు సొంతం చేసు కున్నారు. క్రీడారంగంలో ప్రతిభతో ఆమె రాష్ట్ర గవర్నర్ నుంచి అభినందనలు అందుకున్నారు. సాధించిన అసాధారణ విజయాల పరంపరను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం జెస్సీరాజ్ కు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ ప్రదానం చేసింది.