ఐఎన్టీయూసీని నమ్ముకున్న ఏ కార్మికుడికీ నష్టం జరగదు
‘యారం’ను సన్మానించిన ఎమ్మెల్యే పాయం
✍️ బూర్గంపాడు – దివిటీ (డిసెంబరు 14 )
ఐటీసీ పేపర్ పరిశ్రమలో ఐఎన్టీయూసీని నమ్ముకున్న ఏ ఒక్క కార్మికుడికీ అన్యాయం జరగదని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. శునివారం బూర్గంపాడు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర కనీసవేతనాల సలహా మండలి (మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డ్) సభ్యుడిగా నియమితుడైన సారపాక ఐటీసీ పేపర్ పరిశ్రమలోని ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ యారం పిచ్చిరెడ్డిని సన్మానించి, అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పారిశ్రామిక ప్రాంతమైన పినపాక నియోజకవర్గంలోని ఐటీసీ కార్మిక నాయకుడికి రాష్ట్రస్థాయిలో ఈ పదవి దక్కటం మనకెంతో గర్వకారణం అన్నారు. యారం పిచ్చిరెడ్డిని పదవిలో నియమించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్ లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పిచ్చిరెడ్డి, కార్మికుల పక్షాన నిలబడి, వారిహక్కులు సాధించేవిధంగా పోరాడాలని ఎమ్మెల్యే కోరారు. త్వరలో జరగబోతున్న ఐటీసీ కార్మికసంఘం గుర్తింపు ఎన్నికల సమయంలో ఇలాంటి పదవి రావడం హర్షణీయమన్నారు. ఈ అనుకూల పరిస్థితులలో ఐఎన్టీయూసీని నమ్ముకున్న ఏ కార్మికుడికీ ఎలాంటి నష్టం జరగబోదని తెలిపారు. అందుకే ఐటీసీ పరిశ్రమలో జరగబోయే కార్మిక ఎన్నికల్లో ఐఎన్టీయూసీ మిత్రపక్షాలని భారీమెజార్టీ తో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారం వెంకటేశ్వరరెడ్డి. సారపాక ఐటీసీ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు గోనె రామారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డి.కృష్ణారెడ్డి, నాయకులు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి. చల్లా వెంకట నారాయణ, ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.