Divitimedia
BusinessDELHIHyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTechnologyTelanganaWarangal

కేంద్ర మంత్రులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

కేంద్ర మంత్రులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై విఙ్ఞప్తులు

✍️ న్యూఢిల్లీ – దివిటీ (డిసెంబరు 12)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై గురువారం కేంద్రమంత్రులకు విఙ్ఞప్తులు అందించారు. గురువారం సాయంత్రం సీఎం ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిశారు. తెలంగాణకు కేంద్రీయ విద్యాల‌యాలు కేటాయించాల‌ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ ను కలిసి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేరకు ఇటీవ‌ల రాష్ట్రానికి ఏడు న‌వోద‌య విద్యాల‌యాలు కేటాయించినందుకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఒక్క కేంద్రీయ విద్యాల‌యం కూడా కేటాయించ‌లేద‌ని చెప్తూ, కేంద్రీయ విద్యాల‌యాల‌తోపాటు నవోద‌య విద్యా సంస్థలు లేని జిల్లాల‌కు కేటాయించాల‌ని కోరారు. డీమ్డ్ యూనివ‌ర్సిటీల గుర్తింపు కోసం కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి అనుమ‌తి త‌ప్ప‌నిస‌రని, కానీ ఇటీవ‌ల ఒక్క కేంద్రప్ర‌భుత్వ అనుమ‌తితోనే డీమ్డ్ యూనివ‌ర్సిటీలను గుర్తిస్తున్న విషయం గురించి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డీమ్డ్ యూనివ‌ర్సిటీ గుర్తింపున‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి తప్పనిసరిగా ఎన్ఓసీ తీసుకునేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ర‌కాల అభివృద్ధి ప‌నుల‌కు కేంద్ర ప్ర‌భుత్వ మ‌ద్ద‌తిచ్చేందుకు కృషి చేయాల‌ని కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి జి.కిష‌న్ రెడ్డికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తిచేశారు. రీజనల్ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్‌), హైద‌రాబాద్ మెట్రో ఫేజ్-2 తోపాటు హైద‌రాబాద్, వ‌రంగ‌ల్‌ నగరాల్లో సీవ‌రేజీ, అండ‌ర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్‌, సింగ‌రేణికి బొగ్గుగ‌నుల కేటాయింపుతో స‌హా ప‌లు అంశాల‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో సీఎం చ‌ర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టుల వివరాలు అందించారు. ఈ సంద‌ర్భంగా మొత్తం రూ.1,63,559.31కోట్ల విలువైన ప్రాజెక్టుల విష‌యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరారు. ఆర్ఆర్ఆర్ నిర్మిస్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 2022లోనే ప్ర‌క‌టించిన విష‌యం ఈ సందర్భంగా కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్ఆర్ఆర్ ఉత్త‌రభాగం భూ సేక‌ర‌ణ‌ను ప్రారంభించి, త్రైపాక్షిక ఒప్పందం పూర్త‌యినా ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్‌హెచ్ఏఐ అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని తెలిపారు. ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగానికి కూడా ఇంకా అనుమ‌తివ్వ‌ని విష‌యాన్ని గుర్తుచేశారు. మెట్రో ఫేజ్ -2లో నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, రాయ‌దుర్గం నుంచి కోకాపేట్ నియోపొలిస్‌, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయ‌ణ‌గుట్ట‌, మియాపూర్‌ – ప‌టాన్ చెరు, ఎల్‌బీన‌గ‌ర్‌-హ‌య‌త్ న‌గ‌ర్ మ‌ధ్య మొత్తం 76.4 కి.మీల పొడవునా నిర్మించ‌నున్న మెట్రో రైలు నిర్మాణానికి రూ.24,269 కోట్ల అంచనా వ్యయంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా 50 : 50 వాటాతో చేప్ట‌టేందుకు కూడా స‌హ‌క‌రించాల‌ని కోరారు. మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేప‌ట్ట‌నున్న గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకోసం ర‌క్ష‌ణశాఖ ప‌రిధిలోని 222.27ఎక‌రాలు రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌ద‌లాయించాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ను ఇప్ప‌టికే కోరిన విష‌యాన్ని కిష‌న్ రెడ్డి దృష్టికి తెచ్చారు. ఆ విషయంలో చొరవ చూపాలని, మూసీ పునరుజ్జీవం కోసం చేపట్టిన వివిధ ప్రాజెక్టుల అభివృద్ధికి నిధుల విషయంలో సహకారం కోరారు.
తెలంగాణ‌లో రెండో పెద్ద న‌గ‌రం వ‌రంగ‌ల్ లో రూ.4,170కోట్ల అంచనా వ్య‌యంతో రూపొందించిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ప్లాన్‌ను అమృత్-2 కింద గానీ, ప్ర‌త్యేక ప‌థ‌కం కిందగానీ చేప‌ట్టాల‌ని కోరారు.
సింగ‌రేణి సంస్థ దీర్ఘ‌కాలం మ‌నుగ‌డ కొన‌సాగించేందుకు గాను గోదావ‌రిలోయ ప‌రిధిలోని బొగ్గు బ్లాకుల‌ను సింగ‌రేణికి కేటాయించాల‌ని కోరారు. తెలంగాణ‌ను సెమీకండ‌క్ట‌ర్ మిష‌న్లో చేర్చాల‌ని కూడా విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు మణిహారం లాంటి రీజిన‌ల్ రింగ్ రోడ్ ఉత్త‌రభాగానికి (159 కి.మీ.) అవ‌స‌ర‌మైన సాంకేతిక‌, ఆర్థిక‌ప‌ర‌మైన అనుమతులు వెంట‌నే ఇవ్వాల‌ని జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. సీఎం ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గ‌డ్క‌రీతో స‌మావేశ‌మై తెలంగాణ రాష్ట్ర పరిధిలోని పలు జాతీయ రహదారులు, ఇతర రహదారుల వివరాలను అందించి సత్వరం ఆ అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ‘ద‌క్షిణకాశీ’ గుర్తింపు పొందిన శ్రీ‌శైలంను హైదరాబాద్ తో అనుసంధానించే ఎన్.హెచ్-765లో 125 కిలోమీట‌ర్లు జాతీయ ర‌హ‌దారుల ప్ర‌మాణాలతో ఉంద‌ని తెలిపారు. మరో 62కిలోమీట‌ర్లు ఆమ్రాబాద్ అట‌వీప్రాంత పరిధిలో ఉంద‌ని, ఆ ప్రాంతంలో నాలుగు వ‌రుస‌ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేలా 2024-25 బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే హైద‌రాబాద్ నగరానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌కాశం జిల్లా మ‌ధ్య 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ముఖ్య న‌గ‌రాలైన‌ హైదరాబాద్-విజయవాడ (ఎన్.హెచ్-65) జాతీయ ఠరహదారిని 6 వ‌రుస‌లుగా విస్త‌రించే ప‌నుల డీపీఆర్‌ను త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని సీఎం కోరారు.
తెలంగాణ‌లో రెండో పెద్ద న‌గ‌రం వ‌రంగ‌ల్ దక్షిణభాగంలో బైపాస్ రోడ్ నిర్మాణానికి అనుమ‌తులివ్వాలని కోరారు. వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ న‌గ‌రాల మ‌ధ్య‌గా వెళ్తున్న తెలంగాణ‌-ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ అనుసంధానించే ఎన్‌హెచ్‌-63 (16) ర‌హ‌దారిని న‌గ‌రం వెలుప‌లగా నాలుగు చోట్ల క‌లుపుతూ బైపాస్ మంజూరు చేయాల‌ని కోరారు.
పర్వత్ మాల ప్రాజెక్ట్ పరిధిలో యాదాద్రి దేవాలయం, నల్గొండ పట్టణంలో ఉన్న హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల వద్ద రోప్ వేల ఏర్పాటు కోసం సీఎం కేంద్రమంత్రిని కోరారు. సీఎంతో పాటుగా కేంద్ర మంత్రులను కలిసిన వారిలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, సురేష్ షేట్కర్, పోరిక బలరాంనాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ, రామసహాయం రఘురామిరెడ్డి, కడియం కావ్య, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి ఉన్నారు.

Related posts

హైదరాబాదులో 20న ‘ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అవేర్ నెస్ డ్రైవ్’

Divitimedia

ఆగస్టులో గోదావరి జలాలు వైరా రిజర్వాయరుకు తరలించే ప్రయత్నం

Divitimedia

భారీగా కల్తీ వంటనూనె పట్టివేత

Divitimedia

Leave a Comment