60ఏళ్లు నిండినవారందరికీ ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ
✍️ అమరావతి – దివిటీ (నవంబరు 15)
మీకు 60సంవత్సరాల కంటే ఎక్కువ వయసుందా?… అయితే మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు 25శాతం రాయితీ వర్తిస్తుంది…
గతంనుంచే వృద్ధులకు ఇస్తున్న రాయితీ టికెట్లపై ఆర్టీసీ మరోసారి విడుదల చేసిన మార్గదర్శకాలతో స్పష్టత ఇచ్చింది. సీనియర్ సిటిజన్స్ కు ప్రయాణ ఛార్జీలలో ఇచ్చే 25శాతం రాయితీ విషయంలో పాటించాల్సిన నిబంధనలను సిబ్బందికి వివరించింది. ఈ మేరకు ఏపీలోని అన్ని జిల్లాల డీపీటీఓలు, ఈడీలకు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ అప్పలరాజు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలోని ఆర్టీసీ బస్సులో 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఎప్పటి నుంచో టికెట్లో 25 శాతం రాయితీ ఇస్తున్నారు. టికెట్లు జారీచేసేటప్పుడు వయసు నిర్ధారణకు తగిన గుర్తింపు కార్డు చూపించే విషయంలో ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణించే వృద్ధులకు మధ్య బస్సుల్లో వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటేనే ఏపీఎస్‌ఆర్టీసీ సిబ్బంది రాయితీ ఛార్జీలతో టికెట్లు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇతర రకాల కార్డులను కూడా అంగీకరించడం లేదు. ఒరిజినల్ కార్డులు అందుబాటులో లేకపోతే డిజిటల్ కార్డులు కూడా చూపించవచ్చని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, అవగాహన లేమితో ఆర్టీసీ సిబ్బంది రాయితీ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఈ సమస్యలపై అనేకమంది ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ మరోసారి టికెట్లలో రాయితీ గురించి పాటించాల్సిన నియమ నిబంధనలను ఆర్టీసీ సిబ్బందికి వివరిస్తూ, స్పష్టతతో ఆదేశాలిచ్చింది. తాజా ఆదేశాల ప్రకారం వృద్ధుల వయసు నిర్ధారణకోసం ఆరురకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించవచ్చని ప్రకటించింది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా 60 సంవత్సరాల వయసు పైబడినవారందరికీ రాయితీ వర్తిస్తుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాస్ పోర్టు, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులలో ఏదో ఒకటైనా చూపించి వృద్ధులు 25 శాతం రాయితీ పొందవచ్చని ఏపీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది. ఒరిజినల్ గుర్తింపు కార్డు దగ్గర లేకపోయినా కూడా మొబైల్ ఫోన్లో డిజిటల్ కార్డులు చూపిస్తే రాయితీ టికెట్ జారీ చేయాలని సిబ్బందిని ఆదేశించింది. రాష్ట్రం, ప్రాంతంతో సంబంధం లేకుండా వృద్ధులకు అన్నిరకాల బస్సులలో ప్రయాణ ఛార్జీలలో ఈ రాయితీ ఇవ్వాలంటూ ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు మరోసారి తమ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.