‘ఈపీఎఫ్’ సమస్యపై కేంద్రమంత్రులకు లేఖ రాసిన వైఎస్ షర్మిలారెడ్డి
✍️ అమరావతి – దివిటీ (నవంబరు 15)
ఈపీఎస్ అంశంలో సుప్రీంకోర్టు 2022 నవంబర్‌లో పెన్షనర్ల ప్రయోజనాలకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు అమలు చేయాలని కోరుతూ, ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్. షర్మిలారెడ్డి, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, మన్సుఖ్ మాండవీయలకు శుక్రవారం లేఖ రాశారు.
సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన రెండేళ్ల తర్వాత కూడా ఆ తీర్పునకనుగుణంగా నేటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల వేలాది కుటుంబాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాయని పేర్కొన్నారు.
దీనివల్ల క్లయింట్ల సంఖ్య, ఆర్థిక లావాదేవీల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా గుర్తించబడిన ఈపీఎఫ్ఓపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.
పెన్షనర్లు తగినంత పింఛన్లు అందక బాధకు గురవుతున్నారని పేర్కొన్నారు. 1990లో ప్రవేశపెట్టిన ఈ పథకం కాలక్రమేణా ఆదరణ తగ్గిపోయిందని, రిటైర్ అయిన వారి నుంచి వసూలు చేసిన రూ.లక్షల కోట్లు ఆ సంస్థ వద్ద నిల్వ ఉన్నాయని షర్మిలారెడ్డి తెలిపారు.
ఈ పరిస్థితులలో సంవత్సరకాలంగా పింఛన్లు విడుదల చేయడంలేదని, వృద్ధుల సంక్షేమాన్ని విస్మరించారని ఆమె ఆరోపించారు. ‘మోదీ ప్రభుత్వానికి ఈ సమస్య పరిష్కరించడంలో సమర్థత లేదా? అసలు బాధ్యత ఎవరిదీ?’ అని ఆమె ప్రశ్నించారు. ఈ సమస్యపై కేంద్ర
ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తక్షణం జోక్యం చేసుకోవాలని ఆమె తన లేఖ ద్వారా కోరారు.