మహిళగానైనా మంత్రి స్పందించి ఉంటే బాగుండేది
బీజేపీ దళితమోర్చా అధికార ప్రతినిథి జాడి రామరాజు నేత
✍️ ములుగు – దివిటీ (సెప్టెంబరు 5)
ఆదివాసీ బిడ్డపై అత్యాచారం జరిగినందుకు తెలంగాణ రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా నైతిక భాద్యత గా వహించి రాజీనామా చేయకున్నా మంచిదే కానీ తోటి మహిళగా ఆదివాసీ ఆడబిడ్డగానైనా కనీసం స్పందించి ఉంటే బాగుండేదని బీజేపీ దళిత మోర్చా హితవు పలికింది. ఈ మేరకు గురువారం ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి, హన్మకొండ ఇంచార్జి, కిసాన్ మోర్చా ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి డా జాడి రామరాజు నేత విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికైనా ఉన్నతమైన మంత్రి పదవిలో ఉండి, ఒక ఆదివాసీ మహిళ అత్యాచారానికి గురైతే మైనార్టీ ఓట్లకోసం అత్యాచారం చేసిన వ్యక్తిని కాపాడడానికి చూడటం తగదన్నారు. మంత్రిగా, ఆదివాసీబిడ్డగా, ఓ మహిళగా, అక్కగా తెలంగాణలో ఉన్న 2కోట్ల మంది మహిళలను నమ్మించి మోసం చేసిన మహిళ మంత్రి గా చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఇప్పటికైనా ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆదివాసి గోండ్ మహిళపై లైంగిక దాడికి పాల్పడి హత్యాచారానికి ప్రయత్నించిన మద్దుమ్ ను వెంటనే అరెస్టు చేసి ఉరిశిక్ష విధించే విదంగా స్పందించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళిత బహుజన వర్గాల మహిళలకు కానీ రైతులకు కానీ ఎవ్వరికీ రక్షణ లేకుండా పోయిందని రామరాజు నేత ఆరోపించారు.