లొంగిపోయిన మావోయిస్టు ప్లాటూన్ ఏరియా కమిటీ సభ్యుడు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (సెప్టెంబరు 3)
నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ చర్ల ప్లాటూన్ లో ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న మడకం అయితాల్ అలియాస్ అయిత మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు,141బెటాలియన్ సీఆర్పీఎఫ్ అధికారులు ఎదుట లొంగిపోయాడు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, తెలిపిన వివరాల ప్రకారం లొంగిపోయిన మడకం అయితాల్ అలియాస్ అయిత చర్ల మండలం కొరకటపాడు గ్రామానికి చెందిన యువకుడు. 2017లో నిషేదిత సీపీఐ మావోయిస్టు పార్టీలో మిలీషియా సభ్యుడిగా చేరి, మిలీషియా కమాండరుగా ఉన్న సోడి జోగయ్యతో కలిసి 2020వరకు పని చేశాడు. జోగయ్య మరణానంతరం ఇతను దళ సభ్యుడిగా ప్రమోషన్ పొంది చర్ల ప్లాటూన్ లో పనిచేశాడు. 2021లో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది ఇప్పటివరకు చర్ల ప్లాటూన్ లో కీలక పాత్ర పోషించాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితాల్ మీద రూ.4లక్షల రివార్డ్ ఉందని ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. భద్రాద్రి జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న “ఆపరేషన్ చేయూత” ద్వారా కౌన్సిలింగ్ కార్యక్రమంలో హాజరైన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో లొంగిపోయే దళసభ్యులకు జీవనోపాధి, పునరావాసం కోసం ప్రభుత్వం తరఫున అందవలసిన అన్నిరకాల ప్రతిఫలాలు అందించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్, భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వర్, తదితరులు పాల్గొన్నారు.