ప్రధాని మోదీ చిత్రపటానికి బీజేపీ పాలాభిషేకం
✍️ బూర్గంపాడు – దివిటీ (ఆగస్టు 12)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాండురంగాపురం నుంచి ఒడిశా రాష్ట్రం మల్కనగిరి వరకు 173.63 కిలోమీటర్ల మేర కొత్త రైల్వేలైన్ కు రూ.4150 కోట్లతో ఆమోదం తెలిపినందుకు బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి సోమవారం పాలాభిషేకం చేశారు. బూర్గంపాడు మండలం పాండురంగాపురం రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు నరేంద్రమోదీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి, ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్బంగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, మారుమూల గిరిజన ప్రాంతాలైన భద్రాచలం, ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా, ఒరిస్సాలోని రాయగడ, మల్కనగిరి జిల్లాల వరకు రైల్వేలైన్ ఏర్పాటు వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్గడ్, ఒడిశా రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలు పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగి, ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయన్నారు. పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వేలైన్ కోసం జిల్లా ప్రజలు అనేక రోజులుగా ఎదురు చూస్తున్నారని, కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏకంగా సారపాక, భద్రాచలం మీదుగా మల్కనగిరి వరకు రైల్వేలైన్ శాంక్షన్ చేసి బీజేపీ ప్రభుత్వం జిల్లా ప్రజల మనసు దోచుకుందన్నారు. దీని ద్వారా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం భద్రాద్రి జిల్లా పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల వెంకటరెడ్డి మాట్లాడుతూ, రైల్వే లైన్ ద్వారా దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలానికి మూడు రాష్ట్రాల భక్తులకు రాములవారి దర్శనభాగ్యం కలుగుతుందని, భద్రాచలం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ నరేంద్రబాబు మాట్లాడుతూ, నరేంద్రమోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున రోడ్, రైల్వే, ఎయిర్, వాటర్ కనెక్టివిటీల కోసం లక్షల కోట్ల నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి చింతలచెరువు శ్రీనివాసరావు, భూక్యా సీతారాంనాయక్, నిడదవోలు నాగబాబు, గుగులోత్ బాలునాయక్, మధుసూదన్, బూర్గంపాడు మండల అధ్యక్షుడు బీరక సాయిశ్రీను, పాల్వంచ రూరల్ అధ్యక్షుడు పోల్లోజు క్రాంతిచారీ, మణుగూరు పట్టణ అధ్యక్షుడు లింగంపల్లి రమేష్, మణుగూరు రూరల్ అధ్యక్షుడు కుంజా రామకృష్ణ, ఓబీసీ నాయకుడు గంధం నాగేంద్ర ప్రసాద్, నర్సదాసు రవి పటేల్, రహీం, తదితరులు పాల్గొన్నారు.