అంగన్వాడీ కేంద్రం మూసివేతపై ‘డీడబ్ల్యుఓ’ విచారణ
‘దివిటీ మీడియా’ కథనంపై స్పందన
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 3)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఊట్లపల్లి అంగన్వాడీ కేంద్రం పదిరోజులు మూతబడేందుకు దారితీసిన పరిస్థితులపై జిల్లా సంక్షేమాధికారి(డీడబ్ల్యుఓ) వేల్పుల విజేత శుక్రవారం విచారణ జరిపారు. అశ్వారావుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో నెలకొన్న ఈ దుస్థితిపై “దివిటీ మీడియా” గత నెల 31వ తేదీన “చిన్న సమస్య… చిలికి చిలికి గాలి వానగా మారింది” శీర్షికతో ప్రచురించిన కథనంపై జిల్లా సంక్షేమాధికారి స్పందించారు. శుక్రవారం స్వయంగా ఆ ప్రాజెక్టులో విచారణ జరిపారు. నేరుగా ‘ఊట్లపల్లి’లోని అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన డీడబ్ల్యుఓ, ఆ కేంద్రంలోని రికార్డులు పరిశీలించారు. అక్కడి టీచర్ కేదారేశ్వరితో మాట్లాడి కేంద్రం మూసివేతకు దారితీసిన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీడీపీఓ రోజారాణి వేధింపులు, వత్తిడుల వల్ల తానకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఆమె తెలిపారు. ఆ టీచర్ చెప్పిన విషయాలపై సీడీపీఓ రోజారాణి, సూపర్వైజర్ వరలక్ష్మి నుంచి వివరణ తీసుకున్నారు. ఆ కేంద్రంలోని ఆయా, టీచర్ మధ్య తలెత్తిన వివాదం పరిష్కారంలో లోపాలపై సీడీపీఓ, సూపర్వైజర్లను, అసలు వివాదం ఎందుకు వచ్చిందంటూ అంగన్వాడీ టీచర్, ఆయాలను మందలించారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా లబ్ధిదారులకు సేవలు సక్రమంగా అందించాలని కూడా ఆదేశించారు. అక్కడ పదిరోజులపాటు పోషకాహారం, ప్రిస్కూల్ సేవలు నిలిచిపోయిన వ్యవహారాలపై పూర్తి వివరాలు సేకరించి, తగిన చర్యలు తీసుకుంటామని డీడబ్ల్యుఓ విజేత ఈ సందర్భంగా శనివారం “దివిటీ మీడియా’కు వివరించారు.