Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StyleMuluguNational NewsPoliticsSpot NewsTelanganaYouth

ముగ్గురు మావోయిస్టులు, ఒక సానుభూతిపరుడి అరెస్టు

ముగ్గురు మావోయిస్టులు, ఒక సానుభూతిపరుడి అరెస్టు

వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజు

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 1)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు గురువారం ముగ్గురు మావోయిస్టులు, ఒక సానుభూతిపరుడిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మీడియాకు విడుదల చేసిన వివరాల ప్రకారం… అరెస్టయిన వారు జులై 25న దామరతోగు అటవీప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ (ఎదురుకాల్పులు)లో తప్పించుకుని పరారైన వారని పేర్కొన్నారు. అప్పుడు పారిపోయిన నిషేధిత మావోయిస్టుల ఆచూకి కోసం గుండాల పోలీస్ స్టేషన్ పరిధిలోని దామురతోగు అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలను మోహరించి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దామరతోగు గ్రామానికి దక్షిణంగా అటవీ ప్రాంతంలో గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ముగ్గురు పురుషులు, ఓ మహిళ కనిపించినట్లు తెలిపారు. వారు పోలీసులను గమనించి దాక్కునేందుకు ప్రయత్నిస్తూ, అనుమానాస్పదంగా కనిపించడంతో, వారిని పట్టుకుని విచారించినట్లు వెల్లడించారు. ఇద్దరు పురుషులు, ఆ మహిళ నిషేధిత సీపీఐ మావోయిస్టు దళ సభ్యులుగా, మరో వ్యక్తి గుండాల మండలం దామరతోగు గ్రామానికి చెందిన నిషేధిత మావోయిస్టు సానుభూతిపరుడిగా తేలిందని ఎస్పీ పేర్కొన్నారు.

పట్టుబడినవారిలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కుట్ర పోలీస్ స్టేషన్ పరిధి లోని గొండ్ర గ్రామానికి చెందిన పొట్టం రాజు అలియాస్ జోగా మావోయిస్టు పార్టీలో ఏసీఎం స్థాయిలో ఉన్నట్లు వెల్లడించారు. అతను 2016 నుంచి నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీలో దక్షిణ బస్తర్ డివిజన్ లో రెండవ సెంట్రల్ రీజినల్ కంపెనీలో దళసభ్యునిగా చేరి, 2022 లో ఏసీఎంగా ప్రమోషన్ పొందినట్లు పేర్కొన్నారు. అతని వద్ద నుంచి ఇన్సాస్ తుపాకీ కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అతను తెలంగాణ, చత్తీస్ గడ్ రాష్ట్రాల మావోయిస్టు సాయుధ దళసభ్యులతో కలిసి తెలంగాణ, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో దాదాపు 42 హింసాత్మక సంఘటనలలో పాల్గొన్నాడని తెలిపారు.
అతని వద్దనుంచి ఒక ఇన్సాస్ తుపాకీతోపాటు దానికి సంభంధించిన 29 రౌండ్లు గల రెండు లోడెడ్ మాగ్జిన్స్, పౌచ్, ఆలివ్ గ్రీన్ కలర్ యూనిఫామ్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరొక వ్యక్తిని ఛత్తీస్ గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, బైరాంఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోల్నార్ గ్రామానికి చెందిన ఓయం పాండు అలియాస్ రమేష్ అని తెలిపారు. అతను 2021వ సంవత్సరం డిసెంబర్ నుంచి నిషేధిత మావోయిస్టు పార్టీలో దక్షిణ బస్తర్ డివిజన్ లోని రెండవ సెంట్రల్ రీజనల్ కంపెనీలో దళ సభ్యుడిగా చేరినట్లు చెప్పారు. తెలంగాణ, చత్తీస్ గడ్ రాష్ట్రాల మావోయిస్టు పార్టీ సాయుధ దళ సభ్యులతో కలిసి తెలంగాణ ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో 19 హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నాడని ఎస్పీ పేర్కొన్నారు. అతని వద్ద నుంచి ఆలీవ్ గ్రీస్ కలర్ యూనిఫామ్, 12 రౌండ్లు. 303, రెండు చార్జర్ క్లిప్పులు, పౌచ్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వారితో పాటు పట్టుబడిన మహిళను తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా, దూదేకులపల్లి గ్రామానికి చెందిన పూనెం చుక్కి అలియాస్ తేజ అలియాస్ జోగి అని గుర్తించినట్లు తెలిపారు. ఆమె 2023వ సంవత్సరం మే నుంచి నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో తెలంగాణ రాష్ట్రం ఏటూరునాగారం – మహాదేవపూర్ ఏరియా కమిటీలో దళ సభ్యురాలిగా చేరినట్లు వివరించారు. మావోయిస్టుపార్టీ సాయుధ దళసభ్యులతో కలిసి ఆమె తెలంగాణ, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో 3 హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఆమె వద్ద నుంచి ఒక గొడ్డలిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఆ మావోయిస్టులతోపాటు పట్టుబడిన మరో వ్యక్తిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండల పరిధిలోని దామరతోగు గ్రామానికి చెందిన శ్యామల ముఖేష్,గా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. అతను గత కొంతకాలం నుంచి నిషేధిత మావోయిస్టు సానుభూతిపరుడుగా పనిచేస్తున్నట్లు వెల్లడించిన ఎస్పీ, అతని వద్ద నుంచి మావోయిస్టు పార్టీకి చెందిన కరపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరందరూ దామరతోగులో సభలు సమావేశాలు నిర్వహించి, ఈ జిల్లాలో పార్టీ పునర్నిర్మాణం చేయాలని, అమరవీరుల త్యాగాలను అందరికీ తెలిసేలా చాటింపు వేయాలని చర్చిస్తున్న సమయంలో పోలీసులు వారిని పట్టుకుని విచారించి, అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నలుగురు తీవ్రవాదులపై గుండాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు.

అజ్ఞాతంగా నిషేధిత మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సభ్యులు, నాయకులు స్వచ్ఛందంగా తమంతటతాము జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా తెలంగాణా ప్రభుత్వం తరపున పోలీస్ శాఖ నుంచి ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జనజీవనస్రవంతిలో కలిసిన వారికి ప్రభుత్వం గౌరవప్రదమైన, తగిన పునరావాసం కలిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Related posts

కొత్తగూడెంలో ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు

Divitimedia

రెండు కార్లలో 21 కేజీల గంజాయిని స్వాధీనం

Divitimedia

జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్ 3 పరీక్షలు

Divitimedia

Leave a Comment