చిన్న సమస్య… చిలికి చిలికి గాలివానగా మారింది
పదిరోజులుగా మూతబడిన అంగన్వాడీ కేంద్రం…

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 31)
‘కొండనాలుకకు మందేస్తే… ఉన్న నాలుక ఊడింది…’ అనేది నానుడి. సరిగ్గా ఇదే పరిస్థితికి దారితీసిన ఒక చిన్న సమస్య ప్రస్తుతం చిలికి చిలికి గాలివానగా మారి ఐసీడీఎస్ ప్రాజెక్టునే అతలాకుతలం చేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఒక అంగన్వాడీ కేంద్రం పదిరోజుల నుంచి మూతబడి ఉండేందుకు దారితీసింది. అశ్వారావుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టులో నెలకొన్న దుస్థితి ఇది. ఈ పరిస్థితిపై “దివిటీ మీడియా” సేకరించిన వివరాలిలా ఉన్నాయి…
అశ్వారావుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టులోని ఊట్లపల్లిలో అంగన్వాడీ టీచర్, ఆయా నడుమ వివాదం ఏర్పడిన నేపథ్యంలో సీడీపీఓ రోజారాణి తీసుకున్న చర్యల వల్ల ఆ వివాదం మరింత పెద్దదైంది. ఆ అంగన్వాడీ టీచర్, ఆయాలను ఆఫీసుకు పిలిపించిన సీడీపీఓ టీచర్ ను మందలించి, ఆయాను మరొక అంగన్వాడీ కేంద్రానికి పంపించారు. తనకు సహాయకారిగా ఉండే ఆయాను వేరే కేంద్రానికి పంపించారు. అంతేకాకుండా సీడీపీఓ తనను మందలించి, తాను తప్పుచేసినట్లు క్షమాపణ పత్రం రాయించడంతో మనస్థాపానికి గురై అంగన్వాడీ టీచర్ కేదారేశ్వరి అనారోగ్యం పాలైనట్లు చెప్తున్నారు. తీవ్ర మనస్థాపంతో అనారోగ్యంపాలై స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం అంగన్వాడీ టీచర్ విధులకు హాజరు కావడం లేదు. మరోవైపు ఆ ఆయా కూడా విధులకు హాజరు కావడం లేదు. దీంతో పదిరోజుల నుంచి అంగన్వాడీకేంద్రం మూతబడిపోయి చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందడం లేదు. టీచర్, ఆయాల మధ్య తలెత్తిన చిన్న వివాదాన్ని సరిచేసి, అంగన్వాడీ కేంద్రం సక్రమంగా పని చేసేలా చర్యలు తీసుకోవాల్సిన సీడీపీఓ, వివాదానికి కేంద్రబింధువుగా మారడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అశ్వారావుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టులో నెలకొన్న పరిస్థితులపై మరింత లోతుగా విచారణ జరిపి, ప్రాజెక్టు పనితీరును చక్కదిద్దేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ విషయంపై ‘దివిటీ మీడియా’ జిల్లా సంక్షేమాధికారి విజేతను సంప్రదించగా, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.