షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై13)
షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. ఐడీఓసీ కార్యాలయం సమావేశమందిరంలో జిల్లాకలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన ఎస్పీ రోహిత్ రాజు, అధికారులతో కలిసి శనివారం నిర్వహించిన సమీక్షసమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సమావేశంలో ముందుగా జిల్లాకలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లాలో షెడ్యూల్ తెగల అభివృద్ధికి చేపడుతున్న పనుల గురించి వివరించారు. అనంతరం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ, షెడ్యూల్డ్ తెగల హక్కుల పరిరక్షణకు, అభివృద్ధికోసం ప్రణాళికల రూపకల్పనకు కృషిచేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేవిధంగా చూడాలన్నారు. కమిషన్‌కు ఏదైనా కేసును విచారించే విషయంలో సివిల్ కోర్టుకు ఉండే అధికారాలుంటాయని, చిన్న సమస్య అయినా నిర్లక్ష్యం చేయరాదన్నారు. అధికారులు తమ దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యపై స్పందించి పరిష్కార మార్గాలు చూపాలన్నారు. జిల్లాలో మైనింగ్ కాంట్రాక్ట్ వివరాలన్నీ పదిరోజుల్లో నివేదికలు సమర్పించాలి. గిరిజనులకు అన్ని హక్కులున్నా, గిరిజనుల పేరుతో గిరిజనేతరులు చేస్తున్నారన్నారు. ఈ జిల్లాకు చెందిన వాడిగా తనకు అన్నీ తెలుసని, గిరిజనులు హక్కులను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాటశాలలు, కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పరిశీలించారు. వారు ఉన్నతస్థాయిలో ఉండేలా కల్పిస్తున్న సంక్షేమ ఫలాలు సమయానికి అందేలా అధికారులు చూడాలన్నారు. కమిషన్ తరఫున అన్ని సహాయ సహకారాలందిస్తామని తెలిపారు. హక్కుల ఉల్లంఘన జరగకుండా చూడాలని పోలీసు వారికి సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు ప్రాంతాల బాధితుల వినతులు స్వీకరించి, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టరుకు సూచించారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబాబాద్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ బికం సింగ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తానాజీ, డీడీ మణెమ్మ, డీపీఓ చంద్రమౌళి, సీపీఓ శ్రీనివాసరావు, కొత్తగూడెం ఆర్డీఓ మధు, జిల్లా ఎస్సీ, బీసీ వెల్ఫేర్ అధికారులు అనసూయ, ఇందిర, సివిల్ సప్లైస్ అధికారి రుక్మిణి, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, తదితరులు పాల్గొన్నారు.