హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
✍️ కొత్తగూడెం – దివిటీ (జులై 10)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సమీప గౌతంపూర్ గ్రామంలో జులై 6న జరిగిన హత్యకేసులో కొత్తగూడెం టూటౌన్ పోలీసులు బుధవారం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ వివరాలు వెల్లడించారు. గౌతంపూర్ గ్రామ నివాసి, డ్రైవర్ సాహు ఈశ్వర్ కుమార్ మీద హత్యా యత్నం జరిగింది. అతని బంధువు సాహు చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత ఖమ్మంలోని ఆరోగ్య హాస్పిటల్ లో చికిత్సపొందుతూ అతను మృతిచెందగా పోలీసులు హత్యకేసుగా మార్చి విచారణ చేపట్టారు. ఈ హత్యలో హతుడి భార్య రెహనా హస్తం కూడా ఉందని గుర్తించిన పోలీసులు, ఆమెతో సహా నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అదే గౌతంపూర్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ అరిక రమేష్, హతుడి భార్య రెహనాతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడని కేసు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. రెహనాతో అక్రమ సంబంధానికి ఆమె భర్త ఈశ్వర్ కుమార్ సాహు అడ్డం వస్తున్నాడని, అంతేకాక తాను అక్రమంగా నివాసం ఉంటున్న సింగరేణి క్వార్టర్ ని జీఎంకు చెప్పి ఖాళీ చేయించాడని రమేష్ కక్ష పెంచుకున్నాడు. ఒక పథకం ప్రకారం విజయవాడ వాగుసెంటర్ (1టౌన్ ఏరియా)కు చెందిన చందుతోపాటు తన భార్య ఇందిరతో కలిసి కత్తులతో విచక్షణారహితంగా ఈశ్వర్ కుమార్ పై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఊశ్వర్ కుమార్ చికిత్స పొందుతూ మరణించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఈ కేసులో
అరికె రమేష్, బట్టు చందు, అరికె ఇందిర, మృతుని భార్య ఎం.డి.రెహనాలను కొత్తగూడెం టూ టౌన్ సీఐ ఆధ్వర్యంలో బుధవారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీన పరచుకున్నట్లు వెల్లడించారు.