Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpot NewsTelanganaYouth

ఉద్యోగాల పేరుతో రూ.4కోట్లకు పైగా వసూళ్లు

ఉద్యోగాల పేరుతో రూ.4కోట్లకు పైగా వసూళ్లు

నిరుద్యోగులను మోసంచేసిన వారిని అరెస్టు చేసిన పోలీసులు

వివరాలు వెల్లడించిన భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 9)

సింగరేణి సంస్థతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామని ఆశలు చూపి, అమాయక నిరుద్యోగుల నుంచి ఏకంగా రూ.4.8కోట్ల దాకా అక్రమ వసూళ్లకు పాల్పడిన ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గత మే నెలలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మొత్తం 13మందిని నిందితులుగా గుర్తించి, వారిలో 10 మందిని ఇప్పటివరకు అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం వివరించారు. జిల్లా ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం… 60 మంది అమాయక నిరుద్యోగ యువత నుంచి దాసు హరికిషన్, గుండా వినోద్ కుమార్, ఉపేంద్ర నాయుడుతోపాటు మంగళవారం అరెస్టయిన నిందితురాలు దాసు హారిక, మరికొందరు కలిసి ఈ దందాకు పాల్పడినట్లు తెలిపారు. 2018 నుంచి సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్, క్లర్క్స్, డిపెండెంట్ జాబ్స్, గ్రూప్-2లో ఏసీటీఓ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు చేయిస్తామని చెప్పి ఈ మాయమాటలతో మోసాలకు పాల్పడ్డారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేసిన ఈ నిందితులపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. ఈ నిందితులు రూ.4,08,00,000 (నాలుగు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు) వసూలు చేసినట్లు తేలిందని వివరించారు. కేసుకు సంబంధించి మొత్తం 13 మంది నిందితులను గుర్తించి ఇప్పటివరకు వారిలో 10మందిని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కేసులో అరెస్టైన నిందితుల వద్ద నుంచి ఇప్పటివరకు రూ.1,47,14,000 నగదుతోపాటు 4తులాల బంగారు ఆభరణాలు, ఒక రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ విధంగా చీటింగ్ చేసి సంపాదించిన డబ్బుల ద్వారా నిందితులు కొనుగోలు చేసిన దాదాపు 92.5 తులాల బంగారు ఆభరణాలను బ్యాంకులో తాకట్టుపెట్టి లోన్ తీసుకున్నట్లు నిందితులు తెలిపారన్నారు. వాటిని కూడా వీలైనంత త్వరగా చట్ట ప్రకారం స్వాధీనపర్చుకుంటామని ఎస్పీ వెల్లడించారు. ఇంకా ఈ కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు రూహత్ బేగ్, ఉపేందర్ నాయుడు, రవిరాజ్ లను కూడా త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకుని విచారణ చేపట్టి, బాధితులకు న్యాయం జరిగేలా వ్యవహరించిన కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రవీణ్ తో పాటు సిబ్బందిని కూడా ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు.
నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇలాంటి వాళ్ళు చాలామంది ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసంచేస్తూ సమాజంలో తిరుగుతున్నారని, అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కూడా ఎస్పీ కోరారు.

Related posts

పార్ట్ టైం ఫ్యాకల్టీగా పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం

Divitimedia

స్థానిక సంస్థల ఎన్నికలకోసం సస్పెక్ట్, రౌడీషీటర్స్ కు కౌన్సెలింగ్

Divitimedia

ఐఎన్టీయూసీని నమ్ముకున్న ఏ కార్మికుడికీ నష్టం జరగదు

Divitimedia

Leave a Comment