తెలంగాణకు 2.70లక్షల ఇళ్లు మంజూరు చేయాలి
కేంద్రాన్ని కోరిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
✍️ న్యూఢిల్లీ – దివిటీ (జూన్ 24)
2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎల్‌సీ మోడల్‌లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సోమవారం కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను ఆయన నివాసంలో కలిసి రాష్ట్రంలో తాము నిర్మించ తలపెట్టిన 25లక్షల ఇళ్లలో 15లక్షలు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని, వాటిని లబ్ధిదారు ఆధ్వర్యంలో వ్యక్తిగత ఇళ్లనిర్మాణం(బీఎల్‌సీ) పద్థతిలో నిర్మించనున్నట్లు తెలిపారు. వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో స్మార్ట్ సిటీ మిషన్ కింద చేపట్టే పనులు పూర్తికాలేదని తెలియజేస్తూ, మిషన్ కాల పరిమితి ఈ జూన్ 30తో ముగుస్తున్నందున గడువును 2025 జూన్ వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద వరంగల్‌లో రూ.518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు, కరీంనగర్‌లో రూ.287 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.