విద్యార్థి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి : పి.డి.ఎస్.యు
✍ దివిటీ మీడియా – టేకులపల్లి, ఫిబ్రవరి 29
ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన మూలంగా తాను పరీక్ష రాయలేకపోయానని మనస్థాపానికి గురై, అదిలాబాద్ జిల్లా మాంగ్లూర్ల గ్రామంలో శివకుమార్ అనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోశాధికారి జె గణేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం తగు న్యాయం చేయాలని కోరారు. ప్రజాపాలనంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొత్తసీసాలో పాత సారాలాగానే ఉందని, గత ప్రభుత్వ వైఖరినే అమలు చేస్తూ పేరుకు మాత్రం ప్రజాపాలనని చెప్తుందని గణేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రవాణాసౌకర్యమే సరిగ్గా లేనటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలకు తగిన సమయంలో విద్యార్థులు ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను వారు చెప్పిన సమయానికి అమలు చేస్తున్నారా? అని నిలదీశారు. హామీలను నీటి మీది రాతల్లా మార్చిన ఈ ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని, నిమిషం నిబంధనతో ఈరోజు విద్యార్థి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలోనూ రాష్ట్రస్థాయి ఎంపిక పరీక్షల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదని, దీనివల్ల పేద బలహీన వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. తక్షణమే ఈ నిబంధనలను సడలింపు చేయాలని గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.